మాటల తూటాలు పేలాయ్....!

Update: 2017-12-05 02:33 GMT

టి సర్కార్ కి వ్యతిరేకంగా టి జేఏసీ నేత కోదండరాం నిర్వహించిన కొలువులకై కొట్లాట మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ సభలో పాల్గొన్న కోదండరాం కేసీఆర్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ఇక కాంగ్రెస్ నేతలు సైతం తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. హై కోర్టు అనుమతి ఇచ్చినా అడుగడుగునా సభను అడ్డుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేశారని కోదండరాం ఆరోపణలు సంధించారు. అందరు సంఘటితంగా పోరాడి కేసీఆర్ సర్కార్ ని సాగనంపాలని పిలుపునిచ్చారు కోదండరాం.

ఎవరి కొలువలకోసమన్న కేటీఆర్ .....

కొలువులకై కొట్లాట నిజమే కానీ ఎవరి కొలువలకోసమని ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి రావడంతో కొలువులు పోయిన జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి వంటి వారి కోసమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారికి ఊడి పోయిన కొలువులకోసం శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎవరి కొలువులు ఉంచాలి ఎవరి కొలువులు పీకేయాలన్నది ప్రజలే తెలుస్తారన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి 60 నెలల సమయం ఇచ్చారు ప్రజలు. ఈ సమయంలోగా లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు ఆయన.

మీ కొలువులు పీకేస్తామన్న జీవన్ రెడ్డి ...

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల వల్లే ముఖ్యమంత్రి అయ్యారని ఆయన కొలువు పీకేసే రోజు దగ్గరలోనే ఉందంటూ వ్యాఖ్యానించారు. దీక్ష విరమించి ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ శవయాత్రలు చేసి ఉద్యమం ఆగిపోకుండా ఆయన్ను తిరిగి పోరాటం వైపు వెళ్లేలా చేసిన విషయం మరిచిపోయారంటూ విమర్శించారు. విద్యార్థి లోకం లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిదని నిలదీశారు జీవన్ రెడ్డి. ఇలా ఎవరికి వారు మాటల తూటాలు పేలుస్తూ చలికాలంలో రాజకీయ సెగను తెలంగాణ గడ్డపై రగిలించారు.

Similar News