మాజీ మంత్రి పీతలకు ముందుంది...?

Update: 2017-11-20 10:30 GMT

మాజీ మంత్రి పీతల సుజాతకు ఈసారి గట్టి పోటీ ఎదురుకానుంది. వచ్చే ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి టిక్కెట్ చంద్రబాబు పీతలకు ఇవ్వడమంటూ జరిగితే ఆమెకు గెలుపు అంత సులువు కాదు. ఎందుకంటే వైసీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క నియోజకవర్గం కూడా వైసీపీ గెలవలేకపోయింది. దీంతో వైసీపీ అధినేత జగన్ పశ్చిమపై ఎక్కువగా దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత పోటీ చేశారు. ఆమె నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా ఆ ఎన్నికల్లో టీడీపీకి బలంగా గాలి వీయడంతో పీతల గెలుపొందారు. వెంటనే మంత్రి కూడా అయ్యారు. తర్వాత మంత్రి వర్గం నుంచి వివిధ కారణాల వల్ల చంద్రబాబు తొలగించారు.

పీతలకు పోటీగా....

అయితే పీతలకు నియోజకవర్గంలో అసంతృప్తి ఎక్కువయింది. ఆమెకు, పార్లమెంటు సభ్యుడు మాగంటికి పడదు. దీంతో ఆమె దాదాపు ఒంటరిగానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పీతలపై పోటీకి దించడానికి ఐఏఎస్ కూతురిని రంగంలోకి దించారు. కర్ణాటక క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్వతంత్రరావు కుమార్తె దమ్ము సుహాసిని. ఆమె భర్త కూడా ఉన్నతాధికారి. చింతలపూడి నియోజకవర్గం రిజర్వ్ కావడంతో జగన్ ముందుచూపుతో దమ్ము సుహాసినిని చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. చింతలపూడిలో వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతోనే సుహాసినిని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయించాలన్న యోచనలో జగన్ ఉన్నారు. మొత్తం మీద పీతల సుజాతకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదన్న విషయం స్పష్టమైంది. సుహాసినిని ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకోవాలని జగన్ కోరారు. సుహాసిని క్లిక్ అయితే పీతలకు కష్టాలేనన్నమాట.

Similar News