తెలంగాణలో పలువురు టీఆర్ఎస్ ఎంపీలు ఇటీవల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును తలుచుకొని ఒకింత ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందా లేదా అని మదనపడుతున్నారు. ఇంతకీ వారి ఆందోళనకు కారణమేంటి...? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే... దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ .. రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లు అన్నింటిని గెల్చుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేస్తiన్నారు.
సీనియర్లను పోటీ చేయించాలని....
బలమైన నాయకులను, సీనియర్లను అభ్యర్థులుగా పోటీ చేయించాలని యోచిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించాలంటే.. ముందుగా సొంత రాష్ట్రంలోని అన్ని అన్ని పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ 11 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత టీడీపీ నుంచి మల్లారెడ్డి , వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకొన్నారు. దీంతో లోక్‌సభలో టీఆర్ఎస్ బలం 14కు చేరింది.
సీనియర్ మంత్రులు....
కేంద్రంలో కీలక పాత్ర పోషించాలంటే ఇంతకు మించి సీట్లు గెల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్ సభ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే వారెవరనే విషయంలో లోతుగా సమాచారాన్ని సేకరించారు. టీఆర్ఎస్ సీనియర్లు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న పలువురు మంత్రులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే మెదక్, జహీరాబాద్, కరీంనగర్, వరంగల్, చేవెళ్ల, ఖమ్మం, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ మంత్రులు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
అందుకే ఎంపీల్లో అంత ఆందోళన....
సీఎం కేసీఆర్ పేరే నల్గొండ లేదా మెదక్ లేదా కరీంనగర్ నియోజకవర్గాలకు వినిపిస్తోంది. హరీష్‌రావును మెదక్ లేదా జహీరాబాద్ బరిలో నిలపాలని చూస్తున్నారు. మంత్రి తుమ్మల పేరు ఖమ్మం లోక్‌సభకు, కేసీఆర్ కరీంనగర్‌లో పోటీ చేయకపోతే మంత్రి ఈటల అక్కడ నుంచి బరిలోకి దిగుతారంటున్నారు. మహేందర్‌రెడ్డి పేరు చేవెళ్లకు వినిపిస్తోంది. ఎంపీ కవిత ఎలాగూ మళ్లీ నిజామాబాద్ నుంచే బరిలో ఉంటారు. ఈ వార్తలు పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తుండడంతో ఆయా స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
వీరందరకీ.....
ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, జింతేందర్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, సీతారాంనాయక్, పసునూరి దయాకర్, పాటిల్ తోపాటు మరికొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొందరిని జాతీయస్థాయిలోని థర్డ్ ఫ్రంట్ లోకి తీసుకుని ఢిల్లీ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది . మరోవైపు వీరిలో కొందరిని మాత్రమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్‌లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ ఫ్యూచర్ ఏంటో తెలియక టెన్షన్‌లో ఉన్నారని తెలుస్తోంది.