గత కొంత కాలం హైదరాబాద్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ మాఫియా సద్దుమణిగినట్లే ఉండి మళ్ళీ బుసలు కొడుతోంది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో భారీ గా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ రాకెట్ ను పక్కా సమాచారంతో ఖాకీలు బ్రేక్ చేసి ఈ వ్యవహారంలో పాత్ర పోషించిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరినుంచి కొకైన్ పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వీరి వెనుక వున్న లింక్ లను లాగే ప్రయత్నంలో పడ్డారు మాదాపూర్ పోలీసులు.
గోవా కేంద్రంగా ...
గోవా కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ దేశం నలుమూలలా విస్తరిస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ కి వచ్చే డ్రగ్స్ అన్ని ఎక్కువ మొత్తంలో గోవా నుంచే వస్తున్నట్లు తాజా అరెస్ట్ లతో పోలీసులు బయటపెట్టారు. ముంబాయి కి చెందిన అక్తర్ అనే వ్యాపారి ఈ దందా ను కొందరి బృందంతో సాగిస్తున్నట్లు తేలింది. విశ్వ నగరంలో పబ్ లు, రెస్టారెంట్లు, పార్టీలకు వీరినుంచి డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు కనుగొన్నారు. ఈవెంట్స్ మేనేజర్ల ద్వారా దందాను దర్జాగా సాగుతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సినీ వర్గాలకు ఎవరెవరికి అందుతున్నాయి అనే కోణంలోనూ పోలీసులు కన్నేశారు. తాజా అరెస్ట్ లతో భాగ్యనగరం లో మరోసారి డ్రగ్స్ చర్చ మొదలైంది.