తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల్లో డబ్బులున్నా అప్పులు కోసం జనం తిరిగే పరిస్థితి తలెత్తింది. సంక్రాంతి పండుగకు ఈసారి వరుసగా ఆదివారం సాధారణ సెలవురాగా, మకరసంక్రాంతి సోమవారం, కనుమ పండుగ మంగళవారం బ్యాంక్ లకు సెలవులు వచ్చాయి. దాంతో మూడు రోజుల పాటు జనానికి కరెన్సీ కష్టాలు ఒక రేంజ్ లో ఎదురుకానున్నాయి. ఇప్పటికే గత రెండు రోజులుగా బ్యాంక్ లలో నగదు నిల్వలు నిండు కోవడంతో నగరాలు పట్టణాల్లో 20 వేల రూపాయల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో ఐదువేలరూపాయలకు మించి నగదు విత్ డ్రా లు చేయకుండా పరిమితులు విధించారు బ్యాంకర్లు. ఇక ఏటీఎం లలో సైతం నో క్యాష్ బోర్డు లు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి. దాంతో విధిలేని పరిస్థితుల్లో డబ్బున్న వారు సైతం అప్పులు వెతుకుంటున్నారు. పండగ పూటా తమకు ఈ తిప్పలు ఏమిటంటూ బ్యాంక్ లను ప్రభుత్వాలను నిందిస్తున్నారు.
అసలు కారణాలు ఇవి ...
బ్యాంక్ లలో నగదు నిల్వలు ఎండిపోవడానికి కారణాలు చాలానే వున్నాయి. నోట్ల రద్దు తరువాత నుంచి జనం డిపాజిట్లను బ్యాంక్ లలో వేయడం తగ్గించేశారు. గత మూడు నెలల్లో ఇది మరింత ఘోరంగా దిగజారిపోయింది. విత్ డ్రాలు ఎక్కువ డిపాజిట్ల సంఖ్య తక్కువ అవుతూ వచ్చింది. పోనీ రిజర్వ్ బ్యాంక్ నుంచి నగదు నిల్వలు వచ్చేవి మందగించాయి. ప్రజలు పండగ పర్వదినాల్లో దండిగా డబ్బు ను దుస్తులు, బంగారం, విందు వినోదాలకు ఖర్చు చేసేందుకు సిద్ధం కావడంతో గత వారం రోజులుగా ముందు చూపు ఉన్నవారంతా బ్యాంక్ ల నుంచి సొమ్ములు విత్ డ్రా చేసిపారేశారు. దాని ఫలితంగా నిల్వలు మరింత క్షిణించాయి. వాస్తవానికి ఒకమాదిరి బ్యాంక్ లో సైతం నిత్యం 60 లక్షల రూపాయల లావాదేవీలు సాగుతుంటాయి. మినిమమ్ నిల్వగా 10 నుంచి 20 లక్షల రూపాయలను బ్యాంక్ లు తమవద్ద అట్టేపెట్టుకుంటాయి.
డ్రా చేయడమే తప్ప....
ఇప్పుడు డబ్బు డ్రా చేసేవారే తప్ప వేసేవారు లేకపోవడంతో బ్యాంక్ ల పరిస్థితి గందరగోళంగా ఉంటే ఖాతాదారుడు ఆంక్షలతో కూడిన సొమ్ములు తీసుకుని అసంతృప్తితో అయోమయానికి గురౌతున్నాడు. ఏటీఎం యంత్రాల్లో కనీస మొత్తాన్ని సైతం బ్యాంక్ లు నిల్వ చేయలేని దుస్థితి ఎదురైంది. ఇటీవల కాలంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఎఫ్ డి ఆర్ బిల్లు అరకొర బ్యాంక్ లలో డబ్బు దాచిన వారిలో సైతం ఆందోళన అభద్రత పెంచింది. ఫలితంగా వారు కూడా డిపాజిట్లను డ్రా చేసి నగదు ను అట్టేపెట్టుకుని చలామణిలో పెట్టకపోవడంతో సంక్షోభం తలెత్తినట్లు ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు తిప్పలు తప్పవని అంటున్నారు. మొత్తానికి నోట్ల రద్దు నాటి చేదు అనుభవాలు ప్రజలు మరోసారి చవిచూస్తున్నారు.