మళ్లీ హాట్ హాట్ గా ఆర్కే నగర్

Update: 2017-10-14 16:30 GMT

ఆర్కే నగర్ ఉప ఎన్నిక మళ్లీ తమిళరాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబరు 31వ తేదీలోపు ఆర్కే నగర్ ఉప ఎన్నికను నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ సన్నాహాలు మొదలుపెట్టాయి. వాస్తవానికి జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో పళనిస్వామి వర్గం నుంచి దినకరన్, జయలలిత మేనకోడలు దీప, పన్నీర్ వర్గం నుంచి కూడా పోటీలోకి దిగారు. డీఎంకే కూడా అభ్యర్థిని రంగంలోకి దించింది. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలియడంతో ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. అయితే నిన్న మొన్నటి వరకూ ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఊసే లేదు. అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఎన్నికల కమిషన్ అధికారులు ఆర్కే నగర్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావించారు. దీంతో మళ్లీ ఆర్కే నగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరిగే అవకాశముంది. ఎన్నికల కమిషన్ ప్రకటనతో రాజీకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి.

మారిన సమీకరణాలు......

అయితే గతంలో జరగాల్సిన ఉప ఎన్నికల సమయానికి, ఇప్పటికీ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి పళనిస్వామి వర్గం సస్పెండ్ చేసింది. పళనిస్వామి, పన్నీర్ వర్గాలు ఒక్కటయ్యాయి. బీజేపీకి చేరువగా పళని, పన్నీర్ బ్యాచ్ ఉన్నాయి. మరోవైపు దినకరన్ వెంట 21 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వారిపై అనర్హత వేటును స్పీకర్ వేశారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ సొంత పార్టీ ఏర్పాట్లలో ఉన్నారు. వందరోజుల్లో ఎన్నిక ఉంటే పోటీకి సిద్ధమేనని కమల్ ప్రకటించారు కూడాన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఈసారి ఉత్కంఠగా మారనుంది. పళని స్వామి, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న టాక్ బలంగా విన్పిస్తోంది. ఈ ఎన్నికను ఎలాగైనా గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నారు పళనిస్వామి. అలాగే దినకరన్ కూడా తాను బరిలోకి దిగి చిన్నమ్మ బలమేంటో పళని గ్రూపుకు తెలియజేయాలనుకుంటున్నారు. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది.

Similar News