కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి ఆఖరు బడ్జెట్ కావడంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ కు రూపకల్పన చేశారు. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉండటంతో ఈ బడ్జెట్ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది. కాగా కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి అవుతుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ కావడంతో దీనిపై అందరి దృష్టి ఉంది.
వ్యవసాయానికి, గ్రామాణానికి....
ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రధానమంత్రి సౌభాగ్య యోజన, నాబార్డు తో కలిసి సాగునీటి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన చేపలపెంపకం, పశుసంవర్థానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు. జాలర్లకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. ఆపరేషన్ గ్రీస్ కు ఐదు వందల కోట్లు కేటాయించారు. సౌర విద్యుత్తును మరింత ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ బ్యాంబూ మిషన్ కు 1200 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి 2000 కోట్లు కేటాయించారు.ఫుడ్ ప్రాసెసింగ్ కు 1400 కోట్లు కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 42 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఉండేలా చూస్తామని జైట్లీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పంట కొనుగోలు విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో మొత్తం వ్యవసాయం, గ్రామీణ రంగంపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు కన్పిస్తోంది. అరుణ్ జైట్లీ ఇంకా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.