మళ్లీ అగ్నిపరీక్ష మొదలయిందిగా...!

Update: 2018-01-18 18:29 GMT

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ మూడు రాష్ట్రాలూ ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ కు కీలకమే. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఈ మూడు రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్ లో నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, త్రిపురలో సీపీఎం పవర్ లో ఉంది. ఇక మేఘాలయలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో రెండింటినైనా చేజిక్కించుకోవాలన్నది కమలనాధులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆ రాష్ట్ర నేతలతో ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల వ్యూహాన్ని రచించుకున్నారు.

వచ్చే నెలలోనే...

ఈరోజు మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మొత్తం రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 18వ తేదీన, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల కావడంతో ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ మూడు రాష్ట్రాల్లనూ ఓట్ల లెక్కింపు మార్చి మూడో తేదీన జరగనుంది. ఈ మూడు ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్ మిషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

మూడు రాష్ట్రాల్లోనూ....

త్రిపుర విషయాన్ని తీసుకుంటే అక్కడ వామపక్ష పార్టీతో తలపడటం కమలనాధులకు కష్టమే కావచ్చు. 1993 నుంచి ఇక్కడ సీపీఎం అధికారంలో ఉంది. మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీకి గత ఎన్నికల్లో సీపీఎంకు యాభై స్థానాలు దక్కాయి. బీజేపీ అప్పట్లో ఏడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పరిస్థితీ అంతే కేవలం రెండే స్థానాలతో సరిబెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నాగాలాండ్ లో కూడా అరవై అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ కూడా గత ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ 45 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం నాలుగు సీట్లకే పరిమితమయింది. ఇక మేఘాలయలో కూడా 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 24 స్థానాలు దక్కాయి. బీజేపీకి కేవలం రెండింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సింగిల్ డిజిట్ నుంచి....

అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో కమలనాధులు ఈసారి కనీసం మేఘాలయను తన వశం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. మోడీ ప్రభావంతో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కూడా తమకు పట్టున్న మేఘాలయను మళ్లీ చేజిక్కించుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లారు. దీంతో రాహుల్ ప్రత్యేకంగా మేఘాలయ నేతలతో సమావేశమై నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మొత్తం మీద మూడు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో రెండింటిని కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.

Similar News