మరోసారి బాబుపై పవన్ ఫైర్

Update: 2018-03-17 02:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చంద్రబాబుపై ఫైరయ్యారు. జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై ధ్వజమెత్తిన జనసేనాని తన స్వరాన్ని మరింత పెంచారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పాలనలో అవినీతి హెచ్చుమీరిపోయిందని చెప్పారు. ఏపీకి కరప్షన్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పారు.

అంతా అవినీతే....

చంద్రబాబుపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారాన్ని అప్పగిస్తే దాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఇసుకమాఫియా దగ్గరనుంచి అన్నీ అవినీతి కథలే విన్పిస్తున్నాయన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరిట వేల ఎకరాల భూములను సర్కార్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. వివిధ సామాజికవర్గాల్లో విభేదాలు సృష్టించి ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందని చెప్పారు. తాను అన్న ప్రతి మాటకూ కట్టుబడి ఉంటానని చెప్పారు.

భావోద్వేగాలతో చెలగాటం....

ప్రజల భావోద్వేగాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాట మాడిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు పూర్తిగా కోల్పోయారన్న పవన్ కల్యాణ్ పరిస్థితులు చేజారిపోయాయని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మేల్కొన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం అంతా ఒక డ్రామాగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన కోసం వామపక్షాలతో కలిసి త్వరలోనే ఉద్యమించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఆలోచిస్తున్నామని, త్వరలోనే కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

Similar News