తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కోదండరామ్ పై విరుచుకుపడ్డారు. ఆయనను తయారు చేసింది తానేనని చెప్పారు. జేఏసీ ఛైర్మన్ గా కోదండరామ్ ను నియమించింది తానేనని, జేఏసీ విధివిధానాలను రూపొందించింది తానేనని కేసీఆర్ చెప్పారు. కోదండరామ్ పక్కా కాంగ్రెస్ మనిషని కేసీఆర్ దుయ్యబట్టారు. కోదండరామ్ కాంగ్రెస్ తో కుమ్మక్కై అమరవీరుల స్ఫూర్తియాత్ర పేరుతో ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారన్నారు. కోదండరామ్ ఎప్పుడైనా సర్పంచ్ గానైనా గెలిచారా అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోను రూపొందించింది కూడా కోదండరామేనని కేసీఆర్ వెల్లడించారు. తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. ఆయన మీడియా ముందు కోదండరామ్ పై నిప్పులు చెరిగారు. కోదండరామ్ ముమ్మాటికీ టీఆర్ఎస్ వ్యతిరేకి అని చెప్పారు. అయితే దీనిపై కోదండరామ్ స్పందించారు. వరంగల్ పర్యటనలో ఉన్న కోదండరామ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. రేపు జరగబోయే స్టీరింగ్ కమిటీలో సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తామన్నారు.
దొర నేను కాదు... ఉత్తమ్ మాత్రమే.....
ఇక సోషల్ మీడియాలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను దొరనంటున్నారని, కాని తెలంగాణలో వెలమలు 1.1 శాతం మంది మాత్రమే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తన ఇంటికి ఏమైనా గడీలున్నాయా? అని ప్రశ్నించారు.దొర అనేది కులం కాదని, తాను చిన్న కులంలో పుట్టానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అసలైన దొర పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందించిన కార్మికులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. తన స్నేహితుడు పరిటాల రవి అని ఆయన కుమారుడి పెళ్లికి వెళితే రాజకీయం చేస్తారా? అని విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. తాను గతంలో అనంతపురం ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీతో తమకు రోజూ కొట్లాటేనని కేసీఆర్ చెప్పారు. సింగరేణి ఎన్నికల ద్వారా ఇప్పటికైనా ప్రతిపక్షాలకు బుద్ధి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు.