మరోసారి నోట్లో మట్టే... పోలవరం బిల్లులపై మరో షాక్ ...?

Update: 2018-01-04 02:30 GMT

సమీక్షలపై సమీక్షలు నిర్వహించారు. అదిగో 2018 అని రాష్ట్రం 2019 అని కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ పై వరాల జల్లు కురిపించాయి. ముందు ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఆ తరువాత కలిసి యుగళ గీతం ఆలపించారు. అంతకు ముందు శరవేగం పోలవరం అన్న టిడిపి సర్కార్ పనులు ఆలస్యం అనుకున్న సమయానికి అవ్వాలంటే కొత్త కాంట్రాక్టర్లు కావాలని టెండర్లు పిలిచి అభాసుపాలైంది. కేంద్రం మొట్టికాయలు కొట్టి ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం పొలిటికల్ మైలేజ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఇదంతా రచ్చ రచ్చ కావడంతో మా రెండు ప్రభుత్వాలు పూర్తి చేస్తాయని నిధులకు హామీ ఇచ్చి బిల్లులు పంపండి ఇచ్చేస్తామంది. గడ్కరీ స్పీడ్ మాములుగా లేదని ఆయన నిర్మించకపోతే పోలవరాన్ని ఎవ్వరు కట్టలేరంటూ ఏపీ సీఎం ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. తక్షణం 318 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ అంతే వేగంగా స్పందించారు.

ఇప్పడు పరిస్థితి మళ్ళీ మొదటికి ...

ఇంకేముంది నిధుల వరద మొదలౌతుందనే టిడిపి ప్రభుత్వం తో పాటు అందరు భావించారు. కానీ కేంద్రం విడుదల చేసినట్లు చెప్పిన నిధులకోసం ఆశగా ఎదురు చూస్తే షాక్ తగిలే న్యూస్ లీక్ అయ్యింది. ఇంతకీ అదేమిటి అంటే ఆ 318 కోట్ల రూపాయలు ఇప్పట్లో రావని. తీరా విచారణ చేస్తే కధ మొదటికే వచ్చిందని తేలింది. నాబార్డ్ నిధులతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే 500 కోట్ల రూపాయలు తొలి విడత బ్యాంక్ చెల్లిస్తుంది. అంతకు తక్కువ మొత్తాన్ని వారు మంజూరు చేయరని సమాచారం వచ్చింది. దాంతో తాజాగా మరోమారు 500 కోట్లకు సరిపడా బిల్లులు మళ్ళీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించాలిసి వుంది. దాంతో మరికొంత కాలం నిధుల విడుదల ఆగినట్లే. ఈ ఆలస్యంతో గుత్తేదారు సంస్థ ట్రాన్స్ స్ట్రాయికి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లే.

Similar News