రాజధాని ప్రాంతం విజయవాడలోని అత్యంత కీలకమైన క్లాస్ మాస్ కలగలుపుగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతి నిథ్యం వహిస్తున్న టీడీపీ నేత, పారిశ్రామిక వేత్త బోండా ఉమా మహేశ్వరావు తీరు మరింత కలకలం సృష్టిస్తోంది. నిన్న మొన్ననే విజయవాడలో స్వతంత్ర సమరయోధుడి భూమిని కబ్జా చేశారన్న అరోపణలపై తీవ్ర వాదాస్పదుడిగా మీడియలో వారం రోజుల పాటి నిలిచారు. ఆయన సతీమణి కూడా ఇదే వివాదంలో చిక్కుకుని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆయన సంపాయించుకున్న అంతో ఇంతో పేరు కూడా గాలిలో కొట్టుకుపోయింది. పార్టీ పరువూ గంగపాలైంది.
మరో భూ వివాదం.....
ఇప్పటి వరకు సెంట్రల్‌లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సరిపోయింది కానీ, లేకపోయి ఉంటే.. బొండా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారయ్యేది. ఇక ఆ వివాదం ఏదో సర్దుబాటు అయిందని అనుకుంటున్న సమయంలో తాజాగా ఎమ్మెల్యే బోండా ఉమ, ఆయన అనుచరులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇది కూడా భూమికి సంబంధించిందే కావడం గమనార్హం. తనకు సంబంధం లేని నియోజకవర్గంలో కూడా బొండా ఉమా వేలు పెట్టి టీడీపీ పరువును పోగొట్టారనే వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి.
చంపేస్తామంటున్నారు......
గతంలో వెలుగు చూసిన 60 కోట్ల భూ కుంభకోణంలో ఓ మంత్రి సాయంతో ఏదో విధంగా గట్టెక్కి.. ఓ వారం రోజులు మీడియాకు కనిపించకుండా మేనేజ్ చేసుకున్న ఉమా.. తాజాగా మాత్రం పీకల్లోతు వివాదంలో కూరుకుపోయారు. తనకు సంబంధం లేని పెనమలూరు నియోజకవర్గానికి చెందిన విషయంలో వేలు పెట్టారు. పెనమలూరు డెవెలప్‌మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రయత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూమిని అప్పగించకపోతే చంపేస్తామంటూ బోండా ఉమ అనుచరులు పోలవరపు కిషన్, వెంకట నరసయ్య బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో వారి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, పోనీ తమ భూములను అప్పగించమని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వడ్డీ కూడా చెల్లించమని.....
తమకు తెలియకుండానే తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చామంటున్నారని, వాటికి వడ్డీ కట్టాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకొని న్యాయం చేమని కోరితే ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. మొత్తంగా ఎమ్మెల్యే ఉమా వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదం కావడం, అది కూడా ఎన్నికలకు ఏడాది ముందు ఇలా వివాదాల్లో చిక్కుకుంటుండటంతో ఆయన టిక్కెట్ విషయంలోనూ అనుమానాలు, సందేహాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే చాలాసార్లు బొండాకు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చిన చంద్రబాబు ఆయన్ను ఏం చేస్తారా ? అన్నది విజయవాడ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.