మన్నార్ గుడి మాఫియాను మంచి చేసుకోవాలని....!

Update: 2018-02-02 16:30 GMT

తమిళనాడులో మన్నార్ గుడి మాఫియాను ఎదుర్కొనాలంటే అంత సులభం కాదు. కొన్ని దశాబ్దాల నుంచి జయలలిత అండలో.... శశికళ నీడలో ఈ మన్నార్ గుడి మాఫియా విస్తరించింది. పార్టీలో ఎక్కడ చూసినా మన్నార్ గుడి మాఫియా ఆధిపత్యమే నడుస్తోంది. శశికళ కుటుంబాన్ని బయటకు నెట్టేసి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు, పేరు కూడా వీరికే దక్కాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మన్నార్ గుడి మాఫియా పట్టు ఏంటో పన్నీర్ కు, పళనిస్వామికి తెలిసి వచ్చింది. అప్పటికీ దినకరన్ మద్దతుదారులుగా భావిస్తున్న వెయ్యి మందిని పార్టీ నుంచి బయటకు పంపించి వేశారు.

పార్టీలో నేటికి పట్టు వారిదేనా?

అయినా కూడా మన్నార్ గుడి మాఫియా పార్టీలో వేళ్లూనుకుందని పళని, పన్నీర్ సెల్వంలు అనుమానిస్తున్నారు. సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా ఎవరెవరు మన్నార్ గుడి మాఫియాకు చెందిన వారన్న ఆరాను తీస్తున్నారు. దినకరన్ ను కట్టడి చేయాలంటే పార్టీలో వేళ్లూనుకున్న ఈ మాఫియాను బయటకు పంపించాలన్నది వీరిద్దరి వ్యూహం. అందుకోసం నిఘా నివేదికల ప్రకారం వారికి సభ్యత్వాన్ని ఇవ్వకూడదని, అలాగే సభ్యత్వాన్ని పునరుద్ధరించకూడదని కూడా ఈ ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు.

చిన్నమ్మ కుటుంబంలో విభేదాలను...

మరోవైపు శశికళ కుటుంబంలో పొడచూపిన విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో పడ్డారు. శశికళ జైలుకు వెళుతూ పార్టీ బాధ్యతలను దినకరన్ కు, ఆస్తుల బాధ్యతను వివేక్ జయరామన్ కు అప్పగించారు. దీంతో శశికళ సోదరుడు దివాకరన్ కు ఇది రుచించలేదు. తనను శశికళ దూరంగా పెట్టిందని భావించిన దివాకరన్ ఆస్తులు, పార్టీ పదవుల విషయాల్లో తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. దీంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు దివాకరన్ ను మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం కొందరిని దివాకరన్ వద్దకు దూతగా పంపారు. శశికళపై ఆగ్రహంతో ఉన్న దివాకరన్ వీరి ప్రతిపాదనలకు అంగీకిరించినట్లు సమాచారం. దివాకరన్ వస్తే పార్టీలో మంచి పదవి ఇస్తామని కూడా రాయబారం నడిపారు. ఇదంతా కేవలం దినకరన్ కు చెక్ పెట్టడానికే కాకుండా, మన్నార్ గుడి మాఫియా నుంచి తమను తాము రక్షించుకోవడానికేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

దివాకరన్ ను దగ్గరకు తీస్తే....

జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడులో వరుస మరణాలు జరిగాయి. జయ కారు డ్రైవర్ తో పాటు గెస్ట్ హౌస్ వాచ్ మెన్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీటి వెనక మన్నార్ గుడి మాఫియా ఉందన్న ఆరోపణలు అప్పట్లోనే విన్పించాయి. ఈ కేసులను ప్రభుత్వం కావాలనే తొక్కిపెడుతుందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన్నార్ గుడి మాఫియాను మంచి చేసుకోవాలంటే దివాకరన్ ను దగ్గరకు తీసుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ వచ్చినట్లు సమాచారం. ఇదే జరిగితే దినకరన్ కు పూర్తిగా చెక్ పెట్టినట్లే.

Similar News