అవును! కేంద్రాన్ని ఎదుర్కొనాలంటే.. ఇంగ్లీష్ అయినా మాట్లాడాలి. లేదా హిందీలో అయినా ఇరగదీయాలి. కానీ, మన టీడీపీ ఎంపీలు మాత్రం ఈ రెండింటిలోనూ వీకే! ఈ విషయం తాజాగా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో స్పష్టమైపోయిం ది. దీంతో ఏపీ ప్రయోజనాలు ఇప్పట్లో తీరేలా లేవన్న విషయం కూడా అర్ధమైపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఏ రాష్ట్రానికైనా కేంద్రంతో ఎప్పటికప్పుడు పని ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై యుద్ధం సైతం ప్రకటించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని నిలదీయాల్సి కూడా వస్తుంది. మరి అది ఎలా? కేవలం ఉత్తరాలు రాయడం ద్వారా.. అధికారులతో చర్చలు జరపడం ద్వారా సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పార్లమెంటులోనూ సరైన గళం వినిపించాలి. కేంద్రానికి తగిన విధంగా మాటల తూటాలు పేల్చాలి.
భాష సరిగా రాకుంటే...
అప్పుడు కానీ మన బాధేంటో కేంద్రానికి అర్ధం కాదు. ఏ విషయమైనా పక్కవారికి తెలియాలంటే.. మాటల ద్వారానే సాధ్యం. మరి ఆ మాటలే లేనప్పుడు, నోరు తెరుచుకోనప్పు డు పరిస్థితి ఏంటి? సమస్యలు పరిష్కారం అవుతాయా? ఇప్పుడు ఇలాంటి సమస్యే ఏపీకి వచ్చింది. ఏపీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న ఏఒ క్క హామీని సైతం కేంద్రం పరిష్కరించలేదు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ఏపీ సమస్యలపై పూర్తిస్థాయిలో గొంతు విప్పాల్సిన అవసరం అధికార టీడీపీ పై పడింది. దీంతో టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఉద్యమానికి సిద్ధమయ్యారు. కానీ, కేంద్రంలోని మంత్రులతో ధీటుగా మాట్లాడే విషయంలోనే మన ఎంపీలు పూర్తిగా చతికిల పడుతున్నారు. మనోళ్లకు ఇంగ్లీష్ అంతంత మాత్రం, ఇక, హిందీ అంటే.. ''తూ.. ఆయా.. మై ఆయా..'' అన్న విధంగానే ఉంది.
కేవలం ప్లకార్డులు పట్టుకుని...
ఈ పరిస్థితిలో ఏపీ సమస్యలను ఏవిధంగా వారు కేంద్రానికి వివరిస్తారు. కేవలం ప్లకార్డులు పట్టుకుని, ఎవరో చెప్పిన రెండు హిందీ స్లోగన్లు.. నోట కరుచుకుని నిరసనకు దిగారు. దీంతో కేంద్రానికి ఏపీ సమస్యల చురుకు తాకడం లేదు. గతంలో అన్నగారు ఎన్టీఆర్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్రంతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు హిందీ సమస్య అయింది. అప్పుడు నేరుగా ఆయన హిందీ పండితుడు, ఆయనకు మిత్రుడు అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఇంటికి పిలిపించుకుని రోజుకు రెండు గంటలపాటు హిందీ నేర్చుకున్నారు. ఇక, మన పక్క రాష్ట్రం తమిళనాడు కూడా కేంద్రంపై యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఇంగ్లీష్ వచ్చిన ఎంపీలకు మరింత తర్ఫీదు ఇచ్చేది. ముఖ్యంగా సీఎంగా జయలలిత అటు హిందీలోను, ఇటు ఇంగ్లీష్‌లోనూ కూడా నిష్ణాతురాలు. దీంతో ఎప్పుడు ఛాన్స్ చిక్కినా కేంద్రానికి అర్ధమయ్యే భాషలో దుమ్ము దులిపేసేవారు.
తెలంగాణ ఎంపీలయితే...
తెలంగాణ విషయానికి వస్తే.. సీఎం కేసీఆర్ కు హిందీ కొట్టిన పిండి. ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. దీంతో తెలంగాణ సమస్యలు వచ్చినప్పుడు, కేంద్రంతో చర్చించాలంటే సీఎం కేసీఆర్ వెంటనే తన కూతురుని రంగంలోకి దింపుతున్నారు. ఆమె ఎవరితోనైనా అవలీలగా హిందీ మాట్లాడేస్తారు. కానీ, మన ఎంపీల విషయానికి వస్తే.. హిందీ అంటే కట్టె.,. కొట్టె.. తెచ్చే టైపే. ఇక, ఇంగ్లీష్ మాట్లాడితే.. వినేవారికి చెవుల్లోంచి రక్తం రావడం ఖాయం. మరి ఇలాంటి వారివల్ల ఏపీకి ఒరిగేది ఏంటి? ఎప్పటికి మన బాధ కేంద్రానికి అర్ధమవుతుంది? ఇప్పటికైనా చంద్రబాబు ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లాంటివారిని రంగంలోకి దింపి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీ ఎంపీలకు హిందీ క్లాసులు సైతం నిర్వహించాలనే సూచనలు సైతం వస్తున్నాయి. మరి బాబు పాటిస్తారా? చూడాలి.