చాలా కాలంగా సైలెంట్ గా వున్న ఆహారపదార్ధాల్లో మత్తు మందు ఇచ్చి నిలువు దోపిడీలు చేసే ముఠా మళ్లీ తమ యాక్టివిటీని స్టార్ట్ చేయడం రైల్వే ప్రయాణికులను కలవర పరుస్తుంది. రైల్లో ప్రయాణాలు చేసే సమయాల్లో తోటి ప్రయాణికులతో మాటా మంతి కలపడం. మంచి వారీగా నటిస్తూ వారికి తినుబండారాలు ఆఫర్ చేయడం వారు మత్తు మందు కలిపిన పదార్ధాలు తిని అపస్మారక స్థితికి చేరుకోగానే తమపని కానీయడం ఈ ముఠాలు చేసే పని. ఒంటరిగా వుండే వారిని, నగలు, నగదుతో ప్రయాణించే వారిని గుర్తించి వారిని టార్గెట్ చేస్తారు మత్తు గ్యాంగ్ సభ్యులు. ఒక్కోసారి వీరు ఇచ్చే మత్తు పదార్ధాల తీవ్రత కారణంగా గతంలో పలువురు కోమాలోకి సైతం వెళ్ళిన సంఘటనలు వున్నాయి. ప్రయాణికుల ముసుగులో సాగే ఈ దోపిడీ ముఠా కు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు.
ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో టీలో మత్తుమందు కలిపి ....
తాజాగా హౌరా నుంచి ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న భార్య భర్తలు హైదరాబాద్ వచ్చినా రైలు బోగీలోనే పడుకుని ఉండటాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వారిని హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు అపస్మారక స్థితి నుంచి బయట పడ్డాక వారి నుంచి అసలు వ్యవహారం బయటపడింది. తమ తోటి ప్రయాణికులు ఇచ్చిన టీ తాగి నిద్రలోకి జారుకున్నట్లు వారు పోలీసులకు వెల్లడించారు. తమ నుంచి 12 తులాల బంగారం 25 వేల రూపాయల నగదు మత్తు ముఠా దోపిడీ చేసిందని గుర్తించి ఘొల్లుమన్నారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ముఠా యాక్టివ్ అయ్యిందని రైల్వే ప్రయాణికులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.