తెలంగాణ సర్కార్ ప్రపంచ గ్లోబల్ సమ్మిట్ అందరిని ఆకర్షిస్తున్నా విమర్శకులను మాత్రం మెప్పించలేక పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈ సమ్మిట్ పై కొందరు పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా ఆర్ధిక స్వావలంబన కోసం అంటూ ప్రచారం బానే వుంది కానీ టి సర్కార్ క్యాబినెట్ లో ఒక్క మహిళకు స్థానం ఎందుకు ఇవ్వలేదన్న విమర్శలు మొదలైపోయాయి. ఆర్ధికంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదగడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెబుతున్న ప్రభుత్వం రాజకీయంగా మహిళలను ఎందుకు అణగతొక్కుతుందని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు. ఫేస్ బుక్ , వాట్స్ అప్ లలో ఈ తరహా ప్రచారం జోరు అందుకోవడం విశేషం.
ఇంత ఖర్చు చేసి ఏమి సాధిస్తారు ...?
హైదరాబాద్ ఎప్పుడో విశ్వనగరం గా ఖ్యాతి సాధించిందని కొత్తగా కేసీఆర్ సర్కార్ ఒక్క సదస్సుతో తీసుకువచ్చింది కాదని విమర్శకులు చెలరేగుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా చేస్తూ ప్రభుత్వం ప్రచారం పొందే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు గాలికి వదిలి పెట్టింది అంటున్నారు. కేసీఆర్ పారిశ్రామిక సదస్సులో చేసిన వ్యాఖ్యలపైనా సెటైర్లు పేలుతున్నాయి. ఇక మోడీ, కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సదస్సును చక్కగా వినియోగించేశారన్న వ్యాఖ్యానాలు మరికొందరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అంతర్జాతీయ అతిధులముందు మోడీ బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ అనుకున్నది ఒకటి రేపు రాబోయే రోజుల్లో జరగబోయేది మరొకటి అన్న పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి.