సాధారణంగా ఎమ్మెల్యేలు మంత్రులకు వినతిపత్రాలు ఇస్తుంటారు. తమ సమస్యలను పరిష్కరించమని కోరుతుంటారు. విపక్షాలయితే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై రగడ చేస్తుంటాయి. ప్రజాసమస్యలను పరిష్కరించేశామని ప్రభుత్వం... సమస్యలు పట్టించుకోవడం లేదని విపక్షాలు వాదనలకు దిగుతుంటాయి. అసెంబ్లీలో రైతు సమస్యలపై బాగానే చర్చ జరిగింది. రైతులు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. మరోవైపు విపక్షాలు రైతుల గోడును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఓ చిత్రమైన సంఘటన జరిగింది. ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలన్నీ ఆందోళనకు దిగాయి. కనీసం బీమా సౌకర్యం కూడా దక్కలేదని రైతులు కూడా రోడ్కెక్కారు.
సాయం చేయాలంటూ మంత్రి జోగురామన్న....
ఈ పరిస్థితుల్లో సచివాలయంలో ఒక మంత్రి మరొక మంత్రి ఛాంబర్ కు వెళ్లి తన నియోజకవర్గంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరడం చర్చనీయాంశమైంది. భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటకు తీవ్రమైన నష్టం జరిగింది. అయితే పత్తి రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం అందలేదు. బీమా కంపెనీల నుంచి కూడా స్పందన లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నుంచి మంత్రి జోగురామన్నపై వత్తిడి పెరిగింది. ఆయన నేరుగా సచివాలయంలోని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసురెడ్డిని కలిసి పెద్ద వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్, బేల మండాలాల్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినింది. పత్తి కాయలు కుళ్లిపోయాయి. దూది నలుపురంగుకు మారింది. ఇటు వ్యవసాయ అధికారులు, అటు బీమా అధికారులు రైతులను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో తన నియోజకవర్గంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి జోగురామన్న మరో మంత్రి పోచారం శ్రీనివాసులురెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే... మిగిలిన జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. మంత్రికే దిక్కులేకుంటే.... ఎమ్మెల్యే పరిస్థితి ఏందని విపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి.