మంత్రి అయ్యన్న ఎవరికి టార్గెట్ అయ్యారు?

Update: 2017-10-30 08:30 GMT

మంత్రి అయ్యన్న పాత్రుడు. ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుతో అసలు పడదు. గంటా శ్రీనివాసరావుపై అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. విశాఖ భూ కుంభకోణంలో గంటా అనుచరుల పాత్ర ఉందని పరోక్షంగా ప్రస్తావించారు. సిట్ అధికారులకు కూడా ఆధారాలతో సమర్పించారురు. అయితే మంత్రి అయ్యన్న పాత్రుడు ఆనుపాళ్లు, ఆయన సంభాషణలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఇది వాస్తవం. అయితే వారెవరనే కూపీ లాగే పనిలో పోలీసులు ఉన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు మంత్రి కాబట్టి ఆయన వాహనానికి ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. అయ్యన్న విషయాలు పూర్తిగా తమకు తెలియాలంటే ఆయన సోదరుడు సన్యాసిరావును టార్గెట్ చేయాలనుకున్నట్లుంది.

మంత్రి సోదరుడి వాహనంలో వాయిస్ రికార్డర్....

అందుకే మంత్రి అయ్యన్నపాత్రుడు సన్యాసి వాహనానికి కొందరు వాయిస్ రికార్డర్ ను అమర్చారు. ఈ వాయిస్ రికార్డర్ వాహానాన్ని శుభ్రం చేస్తుండగా సన్యాసి అనుచరులు గుర్తించారు. వాహనం కింది భాగాన కొందరు వాయిస్ రికార్డర్ ను అమర్చారు. మూడు నెలల క్రితమే ఈ వాయిస్ రికార్డర్ ను అమర్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు మూడు నెలల నుంచి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి ఇంట్లో జరిగిన సంభాషణలన్నీ ఇందులో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయనకు గతంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో ఇది మావోయిస్టుల పనేనా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. అయితే మావోలు అయితే వాయిస్ రికార్డర్లను అమర్చన్న వాదన కూడా లేకపోలేదు. మంత్రి అయ్యన్న ప్రత్యర్థులు దీన్ని అమర్చి ఉంటారని భావిస్తున్నారు. మంత్రి అయ్యన్న కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేవారు. శక్తివంతమైన ఈ వాయిస్ రికార్డర్ లో కేవలం వాహనంలో మాట్లాడిన మాటలే కాకుండా మంత్రి సోదరుడు ఇంట్లో సంభాషణలు కూడా రికార్డ్ అవ్వడం విశేషం. ఇప్పటికే ఈ సంభాషణలు ఎవరైనా ఎత్తుకెళ్లారా? అన్న అనుమానం కూడా తలెత్తుతోంది.

Similar News