మండవ నిర్ణయంపై ఉత్కంఠ...!

Update: 2017-11-02 04:30 GMT

నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పసుపు పార్టీకి పెట్టని కోట. జిల్లా అంతటా పసుపు జెండాలే కన్పించేవి. కాని రాష్ట్ర విభజనతో ఆ పార్టీ సగం చచ్చిపోయింది. ఇక రేవంత్ రెడ్డి పార్టీని వీడటంతో పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయినట్లయింది. రేవంత్ రెడ్డి వెంట నిజామాబాద్ కు చెందిన అనేక మంది నేతలు కాంగ్రెస్ లోకి జంప్ చేసేశారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి రాజారాం యాదవ్ ఇలా అందరూ పార్టీని వీడటంతో ఇప్పుడు ఆ పార్టీకి ఇద్దరే పెద్దదిక్కయ్యారు. వారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ. వీరు పార్టీలో ఉన్నట్లా?... ఉన్నా.. లేనట్లేనా? నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగాఅధ్వాన్నంగా మారింది. నేతలు లేక.. క్యాడర్ అయోమయంలో పడినట్లయింది.

దాదాపుగా ఖాళీ అయినట్లే....

ఇప్పటి వరకూ అరికెల నర్సారెడ్డి పార్టీని నడిపిస్తుండటంతో క్యాడర్ కూడా కొంత వెంట నడిచేది. అయితే జిల్లాలో ఉన్న సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు పార్టీకార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పార్టీ నేతలకే అందుబాటులో ఉండటం లేదు. అరకొర కార్యక్రమాలకు హాజరై తాను ఉన్నానని హాజరు వేయించుకుని వెళుతున్నారు. మండవ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సైకిల్ పార్టీలోనే ఉన్నారు. ఆయన కూడా గులాబీ పార్టీలోకి వెళతారని గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు అధ్యక్షత జరిగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని మండవ ఆయనకు తన పరిస్థితిని వివరించనున్నారని తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తును మీరే నిర్ణయించాలని మండవ చంద్రబాబును నేరుగా కోరనున్నట్లు సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా అదే బాటలో ఉన్నారు. ఇప్పటికే అన్నపూర్ణమ్మ అధికార పార్టీ నేతలకు టచ్ లో ఉన్నారు. ఏ నిమిషంలోనైనా ఆమె గులాబీ కండువా కప్పుకునే అవకాశముంది. మొత్తం మీద ఇందూరులో పచ్చ పార్టీ దాదాపుగా కనుమరుగైనట్లే చెప్పుకోవచ్చు.

Similar News