మంచి ముహూర్తం కోసం జగన్ వెయిటింగ్

Update: 2017-10-09 04:30 GMT

ఎట్టకేలకు అమరావతిలో వైసీపీ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. బందరు రోడ్డులో నిర్మించిన ఈ కార్యాలయం పనులకు ఈరోజు లాంఛనంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరపనున్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు కావస్తున్నా వైసీపీకి కొత్త రాజధానిలో పార్టీ కార్యాలయం లేకపోవడంపై అనేక విమర్శలు విన్పిస్తున్నాయి. ఎవరైనా పార్టీలో చేరాలన్నా... కండువా కప్పాలన్నా.... పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ కు రావాల్సిందే. దీంతో టీడీపీ నేతలు కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతలే కాదు వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. జగన్ తో భేటీ కావాలన్నా హైదరాబాద్ కు రావడం అంటే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ ఇచ్చినట్లేనని వైసీపీ నేతలే చెబుతున్నారు.

నేడు సర్వమత ప్రార్థనలు.......

ఈ నేపథ్యంలో విజయవాడ బందరు రోడ్డులో ఆ పార్టీ నేత పార్ధసారధికి చెందిన స్థలంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. అయితే ఒకే చోట అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేశారు. జగన్ కు ప్రత్యేక ఛాంబర్ తో పాటు, ఎమ్మెల్యేలతో సమావేశానికి ప్రత్యేకంగా ఒక హాలు, మీడియా సమావేశానికి ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. అయితే ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ పనులు పూర్తి కావాల్సి ఉంది. వాస్తవానికి దసరాకే ఈ కార్యాలయం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావడంలో జాప్యం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే నెలలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుండటంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనులను త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. తొలుత ఈరోజు పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు జరిపి లాంభనంగా ప్రారంభిస్తారు. తర్వాత మంచి ముహూర్తం చూసుకుని జగన్ చేత ప్రారంభోత్సవం చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Similar News