మంచి పాయింటునే లేవనెత్తిన మంచు మోహన్ బాబు

Update: 2016-10-03 15:46 GMT

సామాజిక కోణంలో జనం మధ్య చర్చనీయాంశంగా నిలవగల ఒక మంచి అంశాన్ని వెటరన్ హీరో మంచు మోహన్ బాబు సోమవారం నాడు లేవనెత్తారు. సరిహద్దుల్లో మన దేశ రక్షణలో నిమగ్నమై విదులు నిర్వర్తిస్తూ... ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పిస్తున్న జవాన్ల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పెద్దగా స్పందించడం లేదని, సరైన రీతిలో ఆర్థిక సహాయం చేయడం లేదని మోహన్ బాబు సోమవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులు పతకాలు సాధించుకు వస్తే వారికి కోట్ల రూపాయలు కానుకలుగా ఇస్తున్న ప్రభుత్వాలు.. అదే స్థాయిలో గానీ, ఆ రకంగా గానీ.. మరణించిన జవాన్ల త్యాగాల విషయంలో స్పందించడం లేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

నిజానికి ఇది బహుధా చర్చనీయాంశమైన విషయమే. సాధారణంగా ఇలాంటి అంశాలు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చర్చ జరుగుతాయి. నిజానికి క్రీడాకారులకు ఇచ్చే కానుకలతో మోహన్ బాబు పోల్చవలసిన అవసరం లేదు గానీ.. ప్రభుత్వాలు సంక్షేమం ముసుగులో తగలేసే అనేకానేక నిధుల కంటె కూడా మరణించిన జవాన్లకు లబ్ధి ని పెంచడం అనేది ఖరీదైన సంగతి కాదనేది చాలా మంది భావించే సంగతి.

నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో నలుగురు కీలక వ్యక్తులు ఉన్న కుటుంబానికి పెద్దగా మోహన్ బాబు మంచి పాయింటునే లేవనెత్తారు. ఇలాంటి విషయంలో ఆయనే మరింతగా చొరవ తీసుకుని ఇంకాస్త మార్గదర్శకంగా నిలవాల్సి ఉంది. వరదలు గట్రా వచ్చినప్పుడు బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడంలో మంచు విష్ణు ఉద్దండుడు. విష్ణుకు మోహన్ బాబు కాస్త స్ఫూర్తి ఇచ్చి.. జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఓ తారల క్రికెట్ మ్యాచ్ వంటిది నిర్వహిస్తే బాగుంటుంది. ఇలాంటి ఇతర కొత్త అయిడియాలు ఏమైనా ఆయన స్వయంగా ఆచరణలో పెడితే.. ఆదర్శంగా నిలిచినట్లు ఉంటుంది.

Similar News