విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ల రద్దు వెనుక చాలా బాగోతమే నడిచినట్లు ప్రభుత్వ యంత్రాంగంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల కోసం సర్కార్ కక్కుర్తిపడి ప్రభుత్వ సంస్థ దక్కించుకున్న కాంట్రాక్ట్ రద్దు చేసి మరీ దిగజారిందని ఆరోపణలు ముసురుకుంటున్నాయి. కేబినెట్ లో తీర్మానం చేసి కాంట్రాక్ట్ రద్దు చేయడం వెనుక జిఎంఆర్ సంస్థకు అధికధరకు కట్టబెట్టేందుకు అని విశ్లేషకులు సైతం అనుమానిస్తున్నారు.
అసలేం జరిగింది ..?
వాస్తవానికి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడు ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా అతి తక్కువ ధర కోడ్ చేసి ఈ పనులు దక్కించుకుంది. అంతే కాదు ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక ప్రభుత్వానికి 31 శాతం రెవెన్యూ ఇస్తామని పేర్కొంది. ఈ టెండర్లకు పోటీ పడిన జిఎంఆర్ 21 శాతం రెవెన్యూ ఇస్తామని చెప్పింది. ఎక్కువ రెవెన్యూ ఇచ్చే ఎ ఎ ఐ కి కాంట్రాక్ట్ కే పనులు దక్కాయి. అలాంటిది ఆ సంస్థ చేత వేగవంతంగా పనులు చేయించుకోవడం మాని అదనపు కాంపౌనెంట్స్ పేరుతో పాత కాంట్రాక్ట్ రద్దు చేయడం చిత్రంగా వుంది. అదే అదనపు కాంపౌనెంట్స్ తో ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ను చేయాలని కోరి వారు చేయలేనప్పుడు టెండర్లు రద్దు చేసి కొత్త వారికి అప్పగించాలి. కానీ సర్కార్ ఏకపక్షంగా ఈ నిర్ణయం విమర్శలు ఆరోపణలకు ఆస్కారం ఇచ్చేలా మారింది.
వైరల్ గా మారిన టెండర్ల రద్దు వ్యవహారం ...
కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర విమానయన శాఖ నేతృత్వంలో ఈ పనులు సాగే వీలున్నా ప్రయివేట్ వారి ద్వారా కమీషన్లు వస్తాయనే కక్కుర్తే టెండర్ల రద్దు కు అసలు కారణమన్న సమాచారం ఇప్పడు పెద్ద ఎత్తునే సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ వైరల్ గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం అంటూ చంద్రబాబు సర్కార్ వచ్చిన నాటినుంచి ప్రచారం చేస్తూ వచ్చింది. అశోక్ గజపతి రాష్ట్రం నుంచి అదే శాఖకు ప్రాతినిధ్యం వహించడం వల్ల ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి అవుతుందని అంతా భావించారు. కానీ సర్కార్ టెండర్ల రద్దుతో వ్యవహారం అసలు మొదలే కాలేదన్న విషయాన్నీ తేటతెల్లం చేయడం తో పాటు అవినీతి ఆరోపణల్లో కూరుకుంది. వీటినుంచి బయటపడాలంటే రద్దు చేసిన టెండర్ల స్థానంలో గ్లోబల్ టెండర్లకు తగిన సమయం ఇచ్చి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారం ప్రజల ముందు పెట్టాలిసిన పరిస్థితి వుంది. కానీ అలా జరగదని జిఎంఆర్ తో సర్కార్ పెద్దలు లోపాయికారీ గా ఇప్పటికే ఒప్పందం అయిపోయిందన్న టాక్ గట్టిగానే నడుస్తుంది. మరి టిడిపి ఈ అపవాదులకు ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.