భార్య కోసం పోలీసులను ఆశ్రయించిన బిగ్ బాస్ విన్నర్

Update: 2017-10-30 02:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ బిగ్ సెలబ్రిటీ శివబాలాజీ మరోసారి సైబర్ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కారు. గతంలో కాటంరాయుడు చిత్రం సందర్భంగా సోషల్ మీడియా లో అసభ్య కామెంట్స్ పై శివబాలాజీ సైబర్ క్రైమ్ స్టేషన్ ను తొలిసారి ఆశ్రయించారు. ఇప్పుడు రెండోసారి తన భార్యకు వస్తున్న అసభ్య అశ్లీల మెయిల్స్ పై కంప్లైంట్ కోసం పోరాటం మొదలు పెట్టారు. గత కొంత కాలంగా శివబాలాజీ భార్యకు తరచుగా కొందరు యూట్యూబ్ , ఫెస్బుక్ సామాజిక మాధ్యమాల్లోను ఈ మెయిల్స్ లోను శృతి మించి కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ సేకరించి సైబర్ క్రైమ్ కి అప్పగించారు ఆయన.

పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు ....

సంబంధం లేని మన తల్లి తండ్రులను, అక్క చెల్లెళ్లను, భార్య పిల్లలను అభ్యంతర కరంగా కామెంట్ చేసే హక్కు ఎవరికైనా ఎవరిచ్చారు. అతి నీచంగా వారిపై చేసే కామెంట్స్ ను చూస్తూ ఊరుకోలేక ఫిర్యాదు చేశా అని శివబాలాజీ చెప్పుకొచ్చారు. ఎవరో ఒకరు తెగించి ముందుకు రాకపోతే ఎటు పోతున్నామో అర్ధం కావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి పెరిగిపోతుందని ఇది తన ఒక్కరి సమస్య కాదని ఆయన ఆందోళన చెందారు.

శాపంగా మారిన సోషల్ మీడియా ...

సామాజిక మాధ్యమాలను మంచి కోసం కాకుండా చెడుకోసం వినియోగించే తత్త్వం పెచ్చరిల్లుతుంది. ఈ ధోరణి రోజు రోజుకు పెరుగుతున్నా అభ్యంతరకర పోస్ట్ లు కామెంట్స్ చేసే వారిపై చర్యలు తీసుకునే యంత్రాంగం లేకుండా పోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలు నిత్య బాధితులైపోయారు. వారిపై వస్తున్న పోస్ట్ లు కామెంట్లు ఘోరంగా ఉంటున్నాయి. ఇవన్నీ చూసి చూడనట్లు వదిలేసినా ఆకామెంట్స్ ను ఎదుర్కొనే వారు మానసికంగా నలిగిపోతున్నారు. సెలబ్రిటీ టార్గెట్ గా పోస్ట్ కామెంట్ వున్నా కొంత వరకు వారు లైట్ తీసుకోవొచ్చు . కానీ మొత్తం కుటుంబ సభ్యులందరినీ కించపరచడాన్ని చాలా కాలంగా భరిస్తూనే వస్తున్నారు. ఇటీవలే సినీ నటులు హేమ వంటివారు ఈ అశ్లీలత అసభ్య రాతలు ఫోటోలపై వార్ మొదలు పెట్టడంతో ఇక వీటికి చెక్ పెట్టాలని ఒక్కొక్కరు ముందుకు వచ్చే పరిస్థితి మొదలు కావడం శుభపరిణామం.

Similar News