భారత్ కి శృంగభంగం చేశారే... !

Update: 2018-03-07 02:30 GMT

అత్యంత క్లిష్టమైన దక్షిణాఫ్రికా టూర్ ను టెస్ట్ సిరీస్ మినహా వన్డే టీట్వంటీలను అజేయంగా గెలుచుకువచ్చిన భారత్ టీం కి అనూహ్యంగా శ్రీలంక నుంచి షాక్ తగిలింది. శ్రీలంక తో ముక్కోణపు టోర్నీని టీ ట్వంటీ మ్యాచ్ తో ప్రారంభించిన భారత్ తొలి మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగింది. కెప్టెన్ విరాట్ కి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ సారధ్యంలో టీం ఇండియా శ్రీలంక లో అడుగు పెట్టింది. ఆరంభంలో నాలుగు బంతులు ఎదుర్కొని డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ వెనుదిరగడంతో భారత్ తడబడింది. అయినా సూపర్ ఫామ్ లో వున్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దు గా చెలరేగాడు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుతిరుగుతున్నా శిఖర్ దూకుడు కి లంక బౌలర్లు బెంబేలెత్తారు. కేవలం నలభై బాల్స్ లో ధావన్ 90 పరుగులు చేసి తన సత్తా మరోసారి చాటి చెప్పాడు. ఇక సురేష్ రైనా మూడు బంతుల్లో ఒక పరుగు చేసి నిరాశపరచగా మనీష్ పాండే 35 బాల్స్ లో 37 పరుగులు చేసి పంత్ 23 బాల్స్ లో 25 పరుగులు, దినేష్ కార్తిక్ 6 బంతుల్లో 13 పరుగులు సాధించి జట్టుకు ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులతో గౌరవ ప్రద స్కోర్ అందించారు. శ్రీలంక బౌలర్లలో చమీర రెండు వికెట్లు, ప్రదీప్ ఒకటి ,జీవన్ మెండిస్ 1 ధనుష్క్ 1 వికెట్ దక్కించుకున్నారు.

చెలరేగిన లంకేయులు ...

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత్ పేలవ బౌలింగ్ తో సొంత గడ్డపై విరుచుకుపడింది. ఐదు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందిపుచ్చుకుంది. ఆ టీం లో కుషాల్ పెరీరా 37 బంతుల్లో 66 పరుగులు చేసి భారత్ పతనాన్ని శాసించాడు. ధనుష్క్ 19, కుషాల్ మెండిస్ 11 పరుగులతో ఆరంభంలో పెవిలియన్ బాట పట్టినా, కుషాల్ కి తోడుగా దినేష్ 14, ఉపుల్ తరంగ 17,దాసరి శంక 15 పెరీరా 22 పరుగులతో ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా ఉతికేశారు. టీం ఇండియా బౌలర్లలో జయదేవ్, సుందర్ చెరో వికెట్ పడగొట్టగా చాహల్ రెండు వికెట్లు తీశారు.

Similar News