భలే నిర్ణయం తీసుకున్న కేసీఆర్!

Update: 2016-11-13 00:46 GMT

నోట్ల కష్టాలు పడుతున్న ప్రజల్లో కొందరికి ఇది మంచి ఊరట. కనీసం తెలంగాణలో నగరాల్లో, పట్టణాల్లో అయినా పరిమితంగా కొంత శాతానికి చెందిన ప్రజలకు అయినా చక్కటి శుభవార్త లాంటి కబురును సీఎం కేసీఆర్ తీసుకున్నారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి చాలా కాలంగా ప్రక్రియ నడుస్తోంది. ఇదివరకే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారికి డిమాండు నోటీసులూ ఇచ్చింది. ఇలాంటి నోటీసులు అందుకున్న వారు.. రద్దయిన పాతనోట్లను రెగ్యులరైజేషన్ రుసుముగా చెల్లించినా తీసుకునేలా కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం రాత్రి వరకు ఈ చెల్లింపులు పాతనోట్లలో అయినా స్వీకరించాలని నిర్ణయించారు.

స్థలాలు, భవనాల రెగ్యులరైజేషన్ మొత్తాలు భారీగా లక్షల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో పాతనోట్లతో చెల్లించే వెసులుబాటు ఇవ్వడం ఆ వర్గం వారికి లాభదాయకంగానే ఉంటుంది.

నోట్ల రద్దు నేపథ్యంలో జీహెచ్ఎంసీకి పన్నులు చెల్లింపులు అన్నీ పద్ధతిగా జరిగిపోతూ.. చాలా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రిజిస్ట్రేషన్లు జరగక, మద్యం విక్రయాలు పడిపోయి రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు ఒకవైపు కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా రెగ్యలరైజేషన్ మొత్తాలను పాతనోట్లలో చెల్లించే ఏర్పాటు రావడం వలన చాలా మంది దీనిని సద్వినియోగం చేసుకుంటారని.. ఈ రూపేణా కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు మార్పిడి జరిగే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

Similar News