భలే...కోడలు...భువనేశ్వరి...!

Update: 2018-01-19 11:30 GMT

నారావారి కోడలిని ఆ ఊరి జనం మర్చిపోలేరు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అంటే నారావారి పల్లె ప్రజలు ప్రాణమిస్తున్నారు. భువనేశ్వరి ఆ ఊరికొచ్చిందంటే చాలు చంద్రబాబుకు మించిన ఆదరణ ఆమెకు లభించడం విశేషం. మెట్టినిల్లుకు భువనేశ్వరి ఎంతో చేస్తున్నారు. ఆ ఊరి ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రతి సంక్రాంతి పండక్కి భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి వచ్చి ఇక్కడే మూడు రోజులు గడుపుతారు. ఆ మూడు రోజులూ భువనేశ్వరి తమ బంధువులతో పాటు ఊరి జనాన్ని అందరినీ పలుకరిస్తారు.

మెట్టినింట్లో కోడలిగా....

అంతేకాదు వారిని పేరుపేరునా పలకరించే భువనేశ్వరి వారి సమస్యలను స్వయంగా అడిగితెలుసుకుంటారు. పదిహేనేళ్ల నుంచి క్ర్రమం తప్పకుండా నారావారిపల్లె వచ్చే భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా పూర్తి సంపదతో తులతూగారు. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థ బాధ్యతలను స్వయంగా చూస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా భువనేశ్వరి విజయం సాధించారు. కాని ఆమె మెట్టినింటికి వచ్చిందంటే చాలు మామూలు గృహిణిగా మారతారు. వంటింట్లోకి వెళ్లి మరీ వంటలు చేసేస్తారట. అంతేకాదు చంద్రబాబు పరిపాలన విషయాల్లో నారావారిపల్లెలో ఉన్నప్పటికీ, భువనేశ్వరి మాత్రం కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం గడుపుతారు.

ఊరి ప్రజల సమస్యలను తనవిగా....

నారావారిపల్లెలో భువనేశ్వరి అనేకమందికి సాయం చేశారు. ఈ విషయాన్ని ఆ ఊరి గ్రామస్థులే చెబుతున్నారు. గ్రామస్థులందరితో మాట్లాడి వారి సమస్యలు తెలసుకున్న భువనేశ్వరి ఆ గ్రామంలో అనేక మందిని చదివిస్తున్నారట. అంతేకాదు చదువుకుని ఉపాధి అవకాశాలు లేని వారికి ఉద్యోగాలను కూడా అనేకమందికి ఇప్పించారట. రుగ్మతలతో బాదపడుతున్న వారికి ఆర్థిక సాయం కూడా అందజేశారట. ఈవిషయాలన్నింటినీ భువనేశ్వరి గోప్యంగానే ఉంచుతారు. నారావారిపల్లె అంటే భువనేశ్వరికి అంత ప్రాణం. అందుకే ఇలాంటి కోడలు మా ఊరికి దొరకడం అదృష్టం అంటున్నారు నారావారి పల్లె వాసులు.

Similar News