వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఆయనకు వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాదయాత్ర నేటికి 66వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికృతమాల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వికృత మాల నుంచి గోవిందాపురం, చెల్లూరు క్రాస్ రోడ్స్, మూలకండ్రిగ మీదుగా పుత్తూరు చేరుకున్నారు. అక్కడి నుంచి వడమల, వడమల పేట మీదుగా పాడిరేడు చేరుకున్నారు. ఇప్పటికి జగన్ సుమారు 883 కిలోమీటర్లు నడక సాగించారు.
సామాన్యులతో మమేకమవుతూ...
అయితే సామాన్యులతో జగన్ పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. వైఎస్ జగన్ ను ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన రామ్మూర్తి జగన్ ను కలిసి తన గోడును విన్పించుకున్నారు. షెడ్యూల్ కులానికి చెందిన రామ్మూర్తి విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో తన భూమిని కోల్పోయారు. అయితే ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇంతవరకూ అందలేదు. బలవంతంగా ప్రభుత్వం తన వద్ద నుంచి భూమిని లాక్కుందని, దళితుడని చూడకుండా పరిహారం చెల్లించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని రామ్మూర్తి వాపోయారు. కోర్టుకు వెళ్లినా లాభం లేదని విలపించారు. అయితే రామ్మూర్తికి జగన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పరిహారం అందేలా చూస్తామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తానే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
చిన్నారి గౌతమికి....
అలాగే నాలుగేళ్ల చిన్నారి గౌతమి కుటుంబ సభ్యులు కూడా జగన్ ను కలిశారు. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. రేణిగుంట మండలం పరకాల గ్రామానికి చెందిన గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్ ను కలిసిన గౌతమ తల్లిడండ్రులు తమ బాధను భరించారు. ఆరోగ్య శ్రీ లో తమకు చికిత్స అందించక పోవడం వల్లనే తమ చిన్నారి చూపును కోల్పోవాల్సి వచ్చిందని గౌతమి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. పార్టీ పరంగా గౌతమిని ఆదుకుంటామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ హయాంలో ఆరోగ్య శ్రీ పథకం కింద ఇటువంటి సమస్యలకు వైద్యం చేసేవారని, కాని ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.