భద్రాద్రి రామయ్యకు సంధ్యా హారతి

Update: 2017-10-13 03:30 GMT

భద్రాద్రి శ్రీరామ చంద్రునికి సంధ్యా హారతి కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం స్వామి వారికి ఇచ్చేందుకు తలపెట్టారు. స్వామి వారి జన్మనక్షత్రం పునర్వసు, తిథి నవమి , అమ్మవారికి అత్యంత ఇష్టమైన పవిత్ర శుక్రవారం కలిసి రావడంతో ఈనెల 13 వ తేదీని హారతికి ముహూర్తంగా పండితులు నిర్ణయించారు. తొలి హారతిని త్రిదండి చినజీయర్ స్వామి చేతులమీదుగా శ్రీరామచంద్రుడు అందుకోనున్నాడు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఉత్తర ద్వారం వద్ద హారతికి ప్రత్యేక వేదిక ...

ఆలయంలో ఉత్తర ద్వారానికి చాలా విశిష్టత వుంది. ముక్కోటి ఏకాదశి నాడు లక్షలాది భక్తులు ఈ ద్వారం నుంచే స్వామిని దర్శించుకుంటూ వుంటారు. ఇప్పుడు శ్రీరామచంద్రుని సంధ్య హారతికి ఉత్తర ద్వారం దగ్గరే అధికారులు వేదిక ఏర్పాటు చేశారు. సంధ్యా హారతి ని అష్టోత్తర హారతులు గా నిర్వహిస్తారు . భక్తులను ఇందులో భాగస్వాములను చేసే విధంగా ఆర్జిత సేవగా దీనిని ప్రకటించారు. రాజమండ్రిలో బుద్ధవరపు ట్రస్ట్ నిర్వహిస్తున్న గోదావరికి అఖండ హారతి కార్యక్రమానికి , వారణాసి లో గంగా హారతికి వచ్చినంత పేరు రావడంతో ఏపీ సీఎం కృష్ణ గోదావరి సంగమ ప్రాంతంలో కృష్ణమ్మకు హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఇటీవల జలసిరికి హారతి పేరుతో బాబు చేపట్టిన హారతులకు మంచి పేరే వచ్చింది. దాంతో తెలంగాణ సర్కార్ కూడా ఇప్పుడు హారతుల కార్యక్రమాలు మొదలు పెట్టింది

Similar News