నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య కొద్ది రోజులుగా సవాళ్లు, ప్రతిసవాళ్ల రాజకీయం జోరుగా జరుగుతోంది. సర్వేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వర్సెస్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరూ ఎప్పటికప్పుడు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గంలోనూ టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది.
గత కొంతకాలంగా ఆరోపణలు...
వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణపై కొద్ది రోజులుగా భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన దందుడుకుగానే ఉంటున్నారు. తాజాగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలనుకుంటోన్న జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కొద్ది రోజులుగా రామకృష్ణను టార్గెట్‌గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని....
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే రామకృష్ణ సవాళ్లతో స్పందించారు. వెంకటగిరి నియోజవర్గంలో జరిగిన ఆయా అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు.
అన్నీ పారదర్శకంగానే....
రాఘవేందర్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తన అవినీతిని నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ఆయనకు సత్తా ఉంటే వచ్చే ఎన్నికల్లో తనపై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని అన్నారు. తన నియోజకవర్గంలో పనులన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయన్న ఆయన... ఒక్క పనిలో అయినా అవినీతి జరిగిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఏదేమైనా వెంకటగిరిలో ఎమ్మెల్యే అవినీతిపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన తీరు కూడా వివాస్పదంగానే ఉంటోంది.