బ్రేకింగ్‌: కాంగ్రెస్ క్లీన్‌స్వీప్‌... బీజేపీ బొక్క బోర్లా

Update: 2017-12-18 05:43 GMT

ఉత్త‌రాదిన అత్యంత కీల‌క‌మైన రాష్ట్రం పంజాబ్‌లో బీజేపీ హ‌వా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సుమారు ప‌ది నెల‌ల కింద‌ట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డిన పంజాబ్‌.. ఇప్ప‌టికీ కోలుకోలేదు. ఇక‌, ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ మాత్రం ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతోంది. నానాటికీ కాంగ్రెస్ హ‌వా భారీ ఎత్తున వీస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ భారీగా దూసుకుపోయింది. వాస్త‌వానికి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్‌కి ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాలి. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌ను విప‌క్షం వైసీపీ కూడా అందిపుచ్చుకోవాలి. కానీ, ఈ ప‌రిస్థితి పంజాబ్‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో కాంగ్రెస్ వేగానికి క‌మ‌లం కుదేలైంది.

బీజేపీకిషాక్....

తాజాగా వ‌చ్చి మునిసిప‌ల్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ ప్ర‌స్తుతం బీజేపీ ప‌ఠిస్తున్న అభివృద్ధి మంత్రం శుద్ధ త‌ప్ప‌ని స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అదేస‌మ‌యంలోనూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వా కూడా నామ‌మాత్ర‌మేన‌ని, పంజాబ్‌లో బీజేపీ ఆట‌లు సాగ‌వ‌ని ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేశారని చెబుతున్నారు. ఇక‌, తాజా ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. పాటియాలా, జలంధర్, అమృతసర్ తోపాటు 29 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 20 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 414 వార్డులు, శిరోమణి అకాలీదళ్ కు 37, బీజీపీకి 15, ఆప్ 1, స్వతంత్ర అభ్యర్థులు 94 వార్డుల్లో విజయం సాధించారు. ఇంత భారీ స్థాయిలో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని స్థానిక బీజేపీ నేత‌లు అస్స‌లు అంచ‌నాలు కూడా వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

హస్తంపార్టీకే అనుకూలం...

అదేస‌మ‌యంలో మోడీ హ‌వా త‌మ‌కు ప్రాణం పోస్తుంద‌ని కూడా భావించారు. అయితే, అనూహ్యంగా తాజా ప‌రిణామాలు మ‌ళ్లీ హ‌స్తం పార్టీకి అనుకూలంగా రావ‌డంతో క‌మ‌ల ద‌ళం ఖంగుతింది. నిజానికి మోడీకి ఈ ప‌రిణామం తీవ్ర ఎదురు దెబ్బ‌గా అభివ‌ర్ణించ‌వ‌చ్చ‌నేది విశ్లేష‌కుల మాట‌. అభివృద్ధి నినాదంతో ముందుకు పోతూ.. త‌న‌కు తిరుగులేద‌ని చెబుతున్న మోడీకి ఈ ఫ‌లితాలు మింగుడు ప‌డ‌వ‌ని కూడా అంటున్నారు. ఇక‌, వ‌చ్చే ఏడాదిన్న‌ర‌లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పంజాబ్ వంటి రాజ‌ధానికి అతి స‌మీపంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఎలా? అనే ప్ర‌శ్న‌లు ఇప్ప‌టికే ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి మోడీ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Similar News