బ్రేకింగ్ : వైసీపీ సంచలన నిర్ణయం

Update: 2017-10-26 06:37 GMT

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే వైసీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా వారిపై బహిష్కరణ వేటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తమ పార్టీని వీడి వెళ్లిన వారిని నలుగురు మంత్రులను చేశారని, మేము సమావేశాలకు హాజరై తాము అడిగిన ప్రశ్నలకు వారిచేత సమాధానం చెప్పించుకోవాలా? అని వైసీపీ ప్రశ్నించింది. స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోనే చేస్తామన్నారు. కాని పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేస్తే తాము అసెంబ్లీకి హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నర్ కు చెప్పినా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి ఏపీ అసెంబ్లీలో దిక్కులేకుండా పోయిందన్నారు. ఈ సమావేశాలే కాదు... ఇక మిగిలి ఉన్న రెండున్నరేళ్లు కూడా అసెంబ్లీకి హాజరుకాబోమని నిర్ణయించారు. దీంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరుగుతాయి.

ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకునే...

గతంలో ఎన్టీరామారావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిష్కరించిన విషయాన్ని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పి వైసీపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు కార్డును వైసీపీ వాడుకుంటోంది. అసెంబ్లీకి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా కక్ష్య పూరిత ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. మొత్తం మీద వైసీపీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Similar News