బ్రేకింగ్ : బీజేపీది కూడా రాజీనామాల బాటే

Update: 2018-03-07 17:33 GMT

కేంద్రమంత్రి వర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం ఉంది. ఈ సమావేశానికి గైర్హాజరు కావాలని బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు కూడా రాజీనామా చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం ముందుగానే ఏపీ మంత్రులను మానసికంగా సిద్ధం చేసింది. బుధవారం ఉదయం కామినేని శ్రీనివాస్ కు ఫోన్ చేసి చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే మంత్రివర్గం నుంచి వైదొలగాలని చెప్పారు. చంద్రబాబు రాత్రి 11 గంటల సమయంలో కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేపే ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారన్న వార్తలు అందుతున్నాయి. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా మాత్రం టీడీపీ వైదొలగలేదు.

Similar News