దీపావళి పండుగ వేళ బాంబు పేల్చారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఏపీ మంత్రులకు తెలంగాణలో పనేంటి? అని ప్రశ్నించారు. మమ్మల్ని జైల్లో పెట్టిన కేసీఆర్ కు వంగి వంగి దండాలు పెడతారా? అని నిలదీశారు. ఏపీలో పయ్యావుల కేశవ్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. ఏపీ ఆర్థికమంత్రి యనమలను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. యనమలకు తెలంగాణలో రెండు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని రేవంత్ రెడ్డి, అన్నం పెట్టిన వాళ్లకే ఏపీ టీడీపీ నేతలు సున్నం పెట్టారన్నారు. తెలంగాణలో పరిటాల సునీత కుటుంబీకులకు బీర్ల తయారీ కంపెనీకి ఎలా అనుమతి లభించిందన్నారు. యనమలకు కాంట్రాక్టులు ఇచ్చినందునే కేసీఆర్ పై ఈగ వాలనీయడం లేదన్నారు. కేసీఆర్ కు అనంతపురంలో అంత ఘనస్వాగతం పలకాల్సిన అవసరమేముందన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తాను కలుస్తానని చెప్పారు. మొత్తం మీద ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ తనకున్న ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. తాను ఎవరినీ కలవలేదని మాత్రం చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది. మంత్రులు యనమల, పరిటాల సునీతలను టార్గెట్ చేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతుంది.