ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని వైసీపీ నేతల కీలక సమావేశం అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రత్యేక హోదా కోసం ఈ సమావేశం కార్యాచరణను ప్రకటించింది. మార్చి 5వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఈ ధర్మాలో వైసీపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారు. మార్చి 1వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయనున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3వ తేదీన జగన్ పాదయాత్రలో వైసీపీ నేతలందరూ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రను జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఎంపీల రాజీనామా అంశంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే త్వరలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మరోసారి మార్చి 3వ తేదీన సీనియర్ నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే కావాలంటూ ఆందోళనను ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.