బ్రేకింగ్ : చివరకు కేఈ యే గెలిచాడు....!

Update: 2017-12-25 13:41 GMT

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరును ఖరారు చేశారు. కేఈ ప్రభాకర్ పేరునే టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. తొలినుంచి ఉత్కంఠ రేపుతున్న అభ్యర్ధిత్వంపై ఎట్టకేలకు టీడీపీలో క్లారిటీ వచ్చింది. కేఈ ప్రభాకర్ నే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారినే ఎంపిక చేశారు. ఈసారి కర్నూలు పార్లమెంటు పరిధిలోని వారికి ఇవ్వాలని నిర్ణయించడంతో కేఈ పేరు దాదాపుగా ఖరారయింది.

కేఈ వాదన ఇదీ....

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజులుగా ఆ జిల్లా నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీ సీనియర్ నేతలతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. నేతల అభిప్రాయాలను చంద్రబాబు విడివిడిగా తీసుకున్నారు. తర్వాత ఆశావహులతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. వారి మనసులో కోరికను తెలుసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ పదవి కోసం కేఈ ప్రభాకర్, చల్లా రామకృష్ణారెడ్డి, శివానందరెడ్డి, శ్రీధర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. కేఈ సోదరుడు ప్రభాకర్ ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని బలంగా కోరారు. కాపుల రిజర్వేషన్లతో బీసీల్లో అసంతృప్తి ఉందని, ఇది తొలగిపోవాలంటే బీసీనేతనైన తనకే ఇవ్వాలని కేఈ ప్రభాకర్ వన్ టూ వన్ మీటింగ్ లో చంద్రబాబుతో చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల ఖర్చును పూర్తిగా తామే భరిస్తామని చెప్పారు. పార్టీపై ఎలాంటి ఆర్థికభారాన్ని మోపమని చెప్పారు.

చల్లా, శివానందరెడ్డి కూడా...

ఇక చల్లా రామకృష్ణారెడ్డి కూడా గట్టిగానే పోటీ పడ్డారు. తాను పార్టీలో చేరేముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ఆయనకు మరోసారి గుర్తు చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ ఎక్కువ సంఖ్యలో నియోజకవర్గాలు గెలచుకుందని, ఈసారి టీడీపీ విజయం సాధించాలంటే తనకు అవకాశం కల్పించాలని చల్లా కోరారు. ఇక శివానందరెడ్డి కూడా గట్టిగానే చంద్రబాబును కోరినట్లు తెలిసింది. దీంతో ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు నేతలతో సమావేశమై ఎన్నికలో అభ్యర్థిపై చర్చించారు. టిక్కెట్ దక్కని వారికి వేరే పదవులు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. ఇక వైసీపీ బరిలోనుంచి తప్పుకోవడంతో చివరకు కేఈనే అభ్యర్థిని ఖరారు చేశారు. టీడీపీ బలం ఉండి... అధికారం ఉండి...గెలుస్తామన్న నమ్మకం ఉండి కూడా అభ్యర్థి ఎంపికలో అందరి నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News