బ్రేకింగ్ : ఎప్పటిలాగానే లోక్ సభ రేపటికి వాయిదా

Update: 2018-04-03 06:48 GMT

వాయిదా పడిన లోక్ సభ తిరిగి 12గంటలకు ప్రారంభమయింది. సభ ప్రారంభమయిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనంటూ నినదించారు. ఆందోళనల మధ్యనే స్థాయి సంఘం నివేదికలను ప్రభుత్వం సభ ముందుంచింది. తర్వాత లోక్ సభలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో స్పీకర్ చదివి విన్పించారు. అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన ఉధృతం చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా ఎందరు సభ్యులున్నారో తాను లెక్కించాలని, దయచేసి తమ స్థానాల్లో కూర్చోమని అన్నాడీఎంకే సభ్యులను స్పీకర్ పదే పదే కోరారు. కాని పోడియంనుచుట్టుముట్టిన అన్నాడీఎంకే సభ్యులు అక్కడి నుంచి కదలకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. హోంమంత్రిరాజ్ నాధ్ సింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు...తదనంతర పరిణామాలు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను గురించి సభకు వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాజ్ నాధ్ చెప్పారు. అన్నాడీఎంకే సభ్యులు శాంతించాలని పదే పదే స్పీకర్ విజ్ఞప్తి చేశారు. తాము చర్చకు సిద్ధమంటూ మంత్రి అనంతకుమార్ ఎప్పటిలాగానే చెప్పారు. సభను ఆర్డర్ లో ఉంచాలని కోరారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నాడీఎంకే సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. యాభై మందికి పైగా సభ్యులం ఉన్నామని చర్చ చేపట్టాలని వైసీపీ, టీడీపీ ఎంపీలు కోరారు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో తాను సభ్యులను లెక్కించలేనంటూ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

Similar News