చంద్రబాబు వేగం పెంచారు. ఇప్పటి వరకూ కొంత సంయమనం పాటిస్తూ... నిదానమే ప్రదానమని భావించిన చంద్రబాబు ఇక త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. తాము ఎన్డీఏ నుంచి ఎందుకు వైదొలుగుతున్నామో వివరిస్తూ స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తారని భావించి సహనంగా ఉన్నామని, కాని కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఏపీకి సాయం చేయాలన్న ధ్యాస లేదని అర్థమైపోతుందన్నారు. తాము కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పుకున్నప్పుడు కూడా కనీసం హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదని తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో తమను కూడా బీజేపీ బలహీన పర్చే ప్రయత్నం చేస్తుందన్నారు. మొత్తం మీద పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్న వెంటనే అమిత్ షాకు లేఖ రాశారు. ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత కేంద్ర వైఖరిపై ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.