ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపొచ్చింది. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయానకి రావాలని ఏపీ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి కబురొచ్చింది. దీంతో ఏపీ బీజేపీ నేతలు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ కేంద్ర నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఫోన్ లో ఏపీ నేతలతో టచ్ లో ఉన్నప్పటికీ వారితో ముఖాముఖి మాట్లాడాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.
అన్నీ సవివరంగా....
తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన టీడీపీ తాజాగా ఎన్డీఏ నుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర పెద్దలు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు పూర్తిగా నెపాన్ని బీజేపీపై నెట్టి వెళ్లాడాన్ని కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంత సాయం చేసింది? ఏ ఏ విషయాలు పెండింగ్ లో ఉన్నాయన్న విషయాలను సవివరంగా ఏపీ బీజేపీనేతలకు వివరించనుంది. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, రెవెన్యూ లోటు వంటి విషయాలపై కూడా బీజేపీ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు.
పొత్తు విషయాలపైనా....
దీంతోపాటు ఏపీలో పార్టీ భవిష్యత్ పైనా నేతలతో చర్చించనుంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని వెళ్లాలా? అన్న దానిపైన కూడా రాష్ట్ర నేతల నుంచి సూచనలను కోరనుంది. టీడీపీ చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు అనుసరించిన విధానాలపైన కూడా ప్రజలకు వివరించాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తదితరులు పాల్గొననున్నారు.