ఖంగారు పడకండి! ఆ విషయం.. అనగానే ఎక్కడికో వెళ్లిపోమాకండి!! ఇది కేవలం రాజకీయాల గురించే!!! ఏపీలో రాజకీ యాలు రోజుకో రకంగా మలుపులు, ఒంపులు తిరుగుతూ వయ్యారాలు పోతున్నాయి. ఏపీ విభజన చట్టంలోని హామీలని కొందరు, లేదు లేదు ప్రత్యేక హోదానే నని మరికొందరు... ఇలా రోజుకో ప్రకటనతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విష యం తెలిసిందే. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పడానికి వీల్లేకుండా అన్ని పార్టీలూ.. తమ తమ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల ను ఏపీ ప్రజల భావోద్రేకాలతో ముడిపెట్టి మరీ ఎన్నికల ముచ్చట తీర్చుకునేందుకు ముందుకు ఉరుకుతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీతో పాటుగా అడ్రస్ అంతంత మాత్రంగా ఉన్న అన్ని పక్షాలూ కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.
ఈ రాష్ట్రంలోనే ఈ పరిస్థితి....
మరి ఏపీలో నెలకొన్న ఇలాంటి రాజకీయ పరిస్థితి ఈ ఒక్కరాష్ట్రానికే పరిమితమా? లేక దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇలానే ఉన్నాయా? చూద్దాం... రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబు టీడీపీ పార్టీ.. ఏపీ ప్రయోజనా ల విషయంలో రోజుకో మాట మారుస్తోందనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. బాబు అనుభవజ్ఞుడని, ఆయన వ్యూహాలకు తిరుగు లేదని భావించి ప్రజలు ఆయనకు పట్టంగట్టారు. అయితే, అధికారం చేపట్టిన నాటి నుంచి తనకు అనుకూలంగా ఉండేలా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు హోదా వద్దన్నదీ ఆయనే. ప్యాకేజీ ముద్దన్నదీ ఆయనే. అయితే, ప్యాకేజీ కింద నిధులు రాబట్టుకోలేక పోయారు. కేంద్రంలో తాను అంటకాగుతున్న పార్టీనే ఉన్నప్పటికీ.. ఆయన ఏపీకి ప్రయోజనం చేయలేక పోయారు.
అఖిల పక్షాలతో కాకుండా....
ఇక, వైసీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టి, ఎంపీల రాజీనామా, అవిశ్వాసం వంటి నిర్ణయాల దాకా వెళ్లేసరికి చంద్రబాబు మళ్లీ టంగ్ మార్చేశారు. ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఇదే కరెక్ట్ ఆయన.. ఇక, కేంద్రపై తిరుగుబాటు చేస్తున్నారు.. అనుకుందామా? దానికి అస్సలు వీలే లేకుండా.. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా సాగుతూనే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. పోనీ.. వైసీపీ అవిశ్వాసానికి ముందుకు వచ్చింది కదా.. దానికేమన్నా మద్దతిస్తారా? అంటే అదీ కనిపించడం లేదు. అవిశ్వాసం సాధించే విశ్వసనీయ విషయం ఒక్కటీ లేదని స్పష్టం చేశారు. ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి. ఏపీ విషయాలపై అఖిలపక్షంతో సమావేశాలు నిర్వహించడం మానేసి.. ఉద్యమ నేతలతో సమావేశానికి సిద్ధమని అంటున్నారు. మరి ఇదెంత వరకు సమంజసమో ఆయనే తేల్చుకోవాలి!
వీరందరిదీ తలోదారి....
ఇక, వైసీపీ, కాంగ్రెస్‌లు కూడా తమ తమ వ్యూహాలతోనే ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ రాజీనామాలు, అవిశ్వాసం కూడా తమ పార్టీ ప్రయోజనాలు, ఎన్నికల లక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకుంటోంది. ఇక,కాంగ్రెస్ నేతలు ఏకంగా రాహుల్‌కి, ఏపీకి ముడిపెట్టేశారు. రాహుల్ ను ప్రధానిని చేయండి.. బస్తీమే సవాల్! అంటూ రఘువీరా.. వీరోచిత వ్యాఖ్యలు కడుపుబ్బనవ్విస్తున్నాయి. ఆకలేసింది అన్నం పెట్టమంటే.. ఎసరు పెట్టేదాకా ఆగలేవా? అన్నట్టుంది రఘువీరా రాజకీయం. ఆ ఎసరు మరిగేదెప్పుడు? అన్నం ఉడికేదెప్పుడు? ఆకలి తీరేదెప్పుడు? ఆయనే దీనికి సమాధానం చెప్పాలి! మరి ఎన్నో ప్రశ్నలతో రాజకీయ నేతల గుండెల్లో నిద్రపోతానన్న పవన్ వైఖరి మరోరకంగా ఉంది. అందరూ రోడ్డెక్కినప్పుడు సదరు జానీ.. నాలుగు గోడలకు పరిమితమవుతారు. అందరూ నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు మీకు చేవలేదా? ఉంటే రోడ్డెక్కండంటాడు!
తమిళనాడు, కర్ణాటకల్లో చూసైనా....
మరి ఈ పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఉదాహరణకు తమిళనాడులో కావేరీ జల వివాదం, జల్లకట్టు విషయాలు వచ్చి కేంద్రంపై పోరాడాల్సి వస్తే.. అధికార, విపక్షాలు ఒకే మాట మీద నడిచి కేంద్రానికి ఒణుకు పుట్టించాయి. మరి కర్ణాటకలోనూ అంతే. కావేరీ జలాల వివాదం సహా రాష్ట్ర ప్రయోజనాల విషయం మూకుమ్మడి వ్యూహాలకు రాష్ట్రం పెట్టింది పేరు. మరి ఆ తరహాలో ఏపీ ప్రయోజనాల కోసం మనోళ్లు పాకులాడడం నేతిబీరలో నెయ్యినే తలపిస్తోంది. మరి ఈ విషయాలు గమనిస్తున్న వారు.. మనకన్నా తమిళ తంబిలే నయంరా తమ్ముడూ! అంటూ నొసలు బిగబడుతున్నారు!! మరి మన నేతలు ఈ విషయాలు గమనిస్తారా?!