బోండాకు మరోసారి బ్యాడ్ లక్...!

Update: 2017-11-24 10:30 GMT

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమ ఆశలు మరోసారి గల్లంతయ్యాయా? అవును... బోండా ఉమ ఎన్నో కలలు కన్నారు. ఎందుకోసమో... తెలుసా... తనకు చీఫ్ విప్ పదవి వస్తుందని గట్టిగా నమ్మారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు దక్కలేదు. దీంతో అప్పట్లో ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. బాహాటంగానే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఉమ మళ్లీ పార్టీలో హుషారయ్యారు. అందుకు మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించకపోయినా.... కనీసం చీఫ్ విప్ పదవి ఇస్తారని బోండా నమ్మకంతో ఉన్నారు. విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించడం, కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని కావడంతో తనకే ఎక్కువ ఛాన్స్ ఉందని, చీఫ్ విప్ పదవి కేబినెట్ ర్యాంకుతో సమానమని తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకున్నారట.

ఈసారి కూడా దక్కకపోయే....

అయితే చంద్రబాబు మాత్రం చీఫ్ విప్ పదవికి పల్లె రఘునాధరెడ్డిని ఎంపిక చేశారు. దీంతో బోండా ఉమ మరోసారి అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కు అతి దగ్గరగా ఉండే బోండా ఉమ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ చినబాబుతో కూడా సన్నిహితంగానే ఉంటారు. అయితే బోండా ఉమ తరచూ వివాదాల్లో చిక్కుకోవడం వల్లనే పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అయిష్టత చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు పదవులు ఇస్తే మిగిలిన జిల్లాల నేతల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముందని కూడా చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలోనే బోండా ఉమాకు మరోసారి భంగపాటు తప్పలేదు. దీంతో బోండా ఉమ మరోసారి అసంతృప్తికి గురయి అధిష్టానం మీద కారాలు మిరియాలు నూరుతున్నారట. పాపం...బోండా... బ్యాడ్ లక్...!

Similar News