బొల్లినేని ప్రాంతంలో జగన్ బోణీ కొట్టేస్తారా?

Update: 2018-02-12 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పోయిన చోటే వెదుక్కుంటున్నారు. 2012లో ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బొల్లినేని వెంకట రామారావు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని రామారావు గెలిచారు. ఇప్పుడు జగన్ ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జగన్ ప్రజాసంకల్పా పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన సీటును తిరిగి దక్కించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.

టీడీపీని దెబ్బకొట్టేందుకు.....

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు పై 2012 ఉప ఎన్నికల్లో దాదాపు ముప్పయి వేల మెజారిటీతో గెలుపొందారు. అయితే అదే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావుపై 2014 ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకంతో ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు ఉన్నారు.

85వ రోజు షెడ్యూల్.....

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉదయగిరి నియోజకవర్గం అనంతాపురం నుంచి ప్రారంభమైన యాత్ర సిద్ధనకొండూరు, హరిజనవాడ మీదుగా పారికోటకు చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం జగన్ అయ్యపురెడ్డి పాలెం మీదుగా పెద్దతాండూరుకు చేరుకుంటుంది. రాత్రి కి జగన్ అక్కడే బస చేయనున్నారు. 84వ రోజున జగన్ మొత్తం 15.7 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. జగన్ కు ఉదయగిరి నియోజకవర్గంలోనూ జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది.

Similar News