బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కేఈ ప్రభాకర్ చర్చలు ఫలించాయనే చెప్పొచ్చు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం నలుగురు పోటీ చేయగా అందులో బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో బరిలో ముగ్గురు అభ్యర్థులు మిగిలారు. వారిలో ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ రెడ్డి కూడా నామినేషన్ ఉపసంహరణ చేసుకోవడంతో ఇక మిగిలింది ఇద్దరే. ఒకరు టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ కాగా...రెండోవ్యక్తి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు నాగిరెడ్డి.
బైరెడ్డితో చర్చలు సఫలం...
అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటికి కేఈ ప్రభాకర్ స్వయంగా వెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం. ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బైరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఈనేపథ్యంలో తనను టీడీపీలో చేర్చుకోవడానికి అభ్యంతరాలపై కేఈని నిలదీసినట్లు తెలుస్తోంది. అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, టీడీపీలో చేరవచ్చని, అధినేత చంద్రబాబుతో మాట్లాడుకోవచ్చని కేఈ ప్రభాకర్ బైరెడ్డికి సూచించినట్లు తెలిసింది.
నేడుచంద్రబాబుతో భేటీ....
దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన అమరావతి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును బైరెడ్డి కలిసే అవకాశముంది. ఆయనతో చర్చించిన తర్వాత నాగిరెడ్డి చేత నామినేషన్ ఉపసంహరించుకోనున్నారని తెలుస్తోంది. బైరెడ్డి ఎంతో కాలంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేఈ ఫ్యామిలీయే ఇందుకు అడ్డుకుంటుందని గ్రహించిన బైరెడ్డి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నికలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకనుకున్న కేఈ ఫ్యామిలీ దిగివచ్చింది. బైరెడ్డితో చర్చలు జరిపి శాంతింప చేసింది. చంద్రబాబుతో భేటీ తర్వాత బైరెడ్డి టీడీపీలోచేరికపై క్లారిటీ రానుంది. మొత్తం మీద కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు దాదాపు ఖరారయినట్లే చెప్పుకోవచ్చు.