బైరెడ్డి మళ్లీ లైన్లోకి వచ్చారే...!

Update: 2017-12-26 09:30 GMT

కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి ఆయన సై అంటున్నాడు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ పేరు రాయలసీమలో ఎవరికీ తెలియంది కాదు. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని పెట్టిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత బైరెడ్డీ టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. కర్నూలు ఎమ్మెల్సీ స్థానం తనకు ఇస్తేపార్టీలో చేరతానని బైరెడ్డి అప్పట్లో షరతు కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. ఆయన చేరికకు ఒక దశలో ముహూర్తం కూడా ఖరారయింది. అయితే బైరెడ్డి చేరికకు కొందరు రాయలసీమ నేతలే అడ్డుపడటంతో బైరెడ్డి చేరిక సాధ్యం కాలేదు.

టీడీపీలోకి రానివ్వకపోవడంతో...

దీంతో రాయలసీమలో తన పట్టును నిలుపుకోవాలన్న ప్రయత్నంలో నంద్యాలలో కూడా బైరెడ్డి పోటీకి నిలిపారు. అయితే తాను నిలబెట్టిన అభ్యర్థికి ధరావత్తులు కూడా రాకపోవడంతో బైరెడ్డి రాయలసీమ నినాదాన్నే పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కేఈ ప్రభాకర్ కు టిక్కెట్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం ఆయన నామినేషన్ కూడా వేశారు.

టీడీపీకి సవాల్ విసిరేందుకే...

వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో బైరెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. తన అనుచరుడైన నాగిరెడ్డి చేత కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేయించారు. దీంతో బైరెడ్డి మరోసారి టీడీపీ నేతలకు సవాల్ విసరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికను పోలింగ్ జరిపించాలన్నదే బైరెడ్డి ధ్యేయంగా కన్పిస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు స్థానిక సంస్థల ప్రతినిధులే అయినప్పటికీ టీడీపీని ముప్పుతిప్పలు పెట్టేందుకే బైరెడ్డి ఈనిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో బలం ఉన్న టీడీపీ మాత్రం ఎవరు పోటీ చేసినా గెలుపు తమదేనన్న ధీమానువ్యక్తం చేస్తోంది.

Similar News