తనను టీడీపీలోకి రానివ్వకుండా అడ్డుకున్న కేఈ ఫ్యామిలీపై కసి తీర్చుకోవడానికే రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన అనుచరుడి చేత కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయించారా? అవుననే అంటున్నారు. ఈ నామినేషన్ తో కేఈ ఫ్యామిలీ తన వద్దకు వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. దీంతో పాటు తాను టీడీపీలో చేరేందుకు కూడా సులువవుతుందని బైరెడ్డి భావిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరుపున కేఈ ప్రభాకర్ నామినేషన్ వేశారు. కేఈ నామినేషన్ తో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు. వీరిలో ఒకరు సమాజ్ వాదీ పార్టీ తరుపున పోటీచేస్తున్నారు. ఇక్కడ వైసీపీ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించినా నలుగురు నామినేషన్ వేయడంతో ఎన్నిక తప్పేట్లు లేదు.
కేఈ ఫ్యామిలీపై కోపంతోనే...
అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేఈ ఫ్యామిలీ మీద కోపం తోనే ఈ ఎన్నికల్లో తన అనుచరుడైన నాగిరెడ్డితో నామినేషన్ వేయించారు. సమాజ్ వాదీ పార్టీ నేత దండు శేషు యాదవ్, పులి జయప్రకాశ్ రెడ్డి, బైరెడ్డి అనుచరుడు పుల్యాల నాగిరెడ్డిలు నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ వరకూ గడువు ఉంది. దీంతో ముగ్గురు అభ్యర్థులతో చర్చలు జరిపి ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులతో కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలు చర్చలు జరుపుతున్నారు. ఉపసంహరణ గడువులోగా వీరి చేత నామినేషన్ ను విత్ డ్రా చేయిస్తే కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయతే ఇందులో దండు శేషు యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయింది. అభ్యర్థిని బలపరుస్తూ చేసిన సంతకాల్లో ఒకరిది ఫోర్జరీ అని తేలడంతో ఎన్నికల అధికారులు శేషుయాదవ్ కు నోటీసులు జారీ చేశారు.
క్రాస్ ఓటింగ్ పై నమ్మకమా?
ఓట్లను చూసుకుంటే మొత్తం 1079 ఉన్నాయి. ఇందులో టీడీపీ బలం 660 ఓట్లు, వైసీపీకి 359, ఇండిపెండెంట్లు 60 ఓట్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే టీడీపీ అభ్యర్థి కేఈ ఎన్నిక దాదాపు ఖాయమే. అయితే 2017 మార్చిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ పెద్దయెత్తున జరిగింది. వాస్తవానికి కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల్లోనూ వైసీపీయే బలంగా ఉండేది. 2014 ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీకి 511, టీడీపీ 480, స్వతంత్రులు 93 మంది ఉండేవారు. అయితే వైసీపీకి చెందిన ఎమ్మెల్యలు అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు పార్టీ మారడంతో వారితో పాటు స్థానక సంస్థల ప్రతినిధులు కూడా మారారు. 2015లోనూ దీనికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అప్పట్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీసీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై 145 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లో అదే శిల్పా చక్రపాణిరెడ్డి కేవలం 62 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఇక్కడ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ వర్గం వారిచేత క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అప్పట్లో శిల్పా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడుకూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బైరెడ్డి నమ్మకంతో ఉన్నారు.
కుదిరితే...ఉపసంహరణ....
అయితే పుల్యాల నాగిరెడ్డి విషయంలోనే కొంత ఇబ్బందిగా ఉంది. ఈయన బైరెడ్డి అనుచరుడు కావడంతో బైరెడ్డితోనే మాట్లాడాల్సి ఉంది. బైరెడ్డి మాత్రం తనను టీడీపీలో చేరకుండా మోకాలడ్డిన కేఈ కుటుంబాన్ని టెన్షన్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. వారి చేత కాసులు వదిలించాలన్నది ఆయన ధ్యేయంగా కన్పిస్తోంది. ఎన్నిక అంటూ జరిగితే వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, స్వతంత్రులు బైరెడ్డి అనుచరుడికి మద్దతు పలికే అవకాశముందని బైరెడ్డి చెబుతున్నారు. దీన్ని అవకాశంగా చేసుకుని కేఈ ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టాలన్నది బైరెడ్డి యోచన. అయితే కేఈ ఫ్యామిలీ దిగి వచ్చి తనతో సంప్రదింపులు జరిపితే... బైరెడ్డి ఆలోచించే అవకాశం ఉంది. అంతేకాదు టీడీపీలో చేరేందుకు కూడా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కర్నూలు జిల్లాలోని పొలిటికల్ వర్గాల్లో విన్పిస్తున్న మాట. మొత్తం మీద బైరెడ్డి బేరసారాల కోసమే తన అనుచరుడిని రంగంలోకి దింపారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.