ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో భారత ఉపఖండం లోని శ్రీలంక, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఈ సక్సెస్ ఫార్ములా కాపీ కొట్టేశాయి. తమ తమ దేశాల్లో ఐపీఎల్ తరహాలోనే స్కూల్ స్టార్ట్ చేశాయి. పాకిస్థాన్ లో వున్న భద్రతా కారణాల రీత్యా టోర్నీ ని దుబాయి కేంద్రంగా మొదలు పెట్టాయి. ఇక శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో నిర్వహించిన టోర్నమెంట్లలో బెట్టింగ్ బాగోతాలు వెలుగుచూడటంతో నిఘా పెట్టి విచారణ జరిపిన ఐసిసి ఆ పోటీలను రద్దు చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నేతృత్వంలో పిసిబి మాత్రం కొనసాగిస్తోంది. ఇప్పటికే గత ఏడాది కొందరు క్రికెటర్లు బెట్టింగ్ భాగోతం బయటపడటంతో వారిపై నిషేధం విధించింది ఐసిసి, పిసిబి.
తీరు మార్చుకోని క్రికెటర్లు ....
జీవితకాల నిషేధానికి కొందరు క్రికెటర్లను నిషేధిస్తున్నా పాకిస్థాన్ ఆటగాళ్ల తీరులో ఎలాంటి మార్పు రావడంలేదు. తాజాగా దుబాయిలో సాగుతున్న పిసిఎల్ పై ఫిర్యాదులు వెల్లువలా వస్తూ ఉండటంతో ఐసిసి సీరియస్ గా దృష్టి పెట్టింది. కొందరి ఆటగాళ్ల బండారం దాంతో బయటపడింది. విషయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దృష్టిలో పెట్టింది. దీనిపై విచారణ చేపట్టింది పాక్ బోర్డు. ఇప్పటికే ఐదుగురు ప్లేయర్స్ నిండా బెట్టింగ్ లలో మునిగి పోయినట్లు గుర్తించింది. వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది.
స్టేడియంలో పట్టుమని 100 మంది లేకుండా ...
భారత్ లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే స్టేడియాలు ఇసుక వేస్తే రాలనంత నిండిపోతాయి. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే ఎంతటి కోలాహలం ఉంటుందో అదే స్థాయిలో ప్రతి మ్యాచ్ కి క్రీడాభిమానులు నీరాజనాలు పలుకుతారు. అందుకే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు డబ్బు కన్నా ఎక్కువగా ఇండియా లో క్రికెట్ ఆడేందుకు ఉత్సహం చూపిస్తారు. ఐపీఎల్ సక్సెస్ కావడంలో భారత్ లో క్రికెట్ కు వున్న ఆదరణ కూడా ఒక కారణం. దీనికి భిన్నంగా వుంది దుబాయి లో పిసిఎల్ . గ్యాలరీలో ఒక్కో మ్యాచ్ కి పట్టుమని 100 మంది కూడా ఉండటం లేదు. అయినా సీరియస్ గా పోటీలు సాగడం వెనుక బెట్టింగ్ మాఫియా అన్నది జగమెరిగిన సత్యం.
ప్లేయర్స్ బెట్టింగ్ ముఠా చెట్టపట్టాలు ...
ఈ మాఫియా నేరుగా క్రికెటర్లు బస చేస్తున్న హోటల్స్ లలో రూమ్ లు బుక్ చేసుకోవడం సోషల్ మీడియా లో వారితో మిత్రత్వాన్ని కొనసాగించడం మ్యాచ్ లను తాము ఎలా నిర్ణయిస్తే అలా జయాపజయాలు డిసైడ్ చేసేయడం రొటీన్ అయిపోయాయి. ఒక్కరోజు కూడా క్రికెట్ క్యాలెండర్ లో గ్యాప్ లేకుండా మ్యాచ్ లు ఉండేలా చూసుకుంటూ వేలకోట్ల రూపాయల సముపార్జనే ధ్యేయంగా బెట్టింగ్ రాకెట్స్ క్రికెట్ ను శాసిస్తూ ఉండటం క్రీడాభిమానులను కలచివేస్తుండగా మరోపక్క బెట్టింగ్ కి అలవాటు పడిన వారు జీవితాలను సర్వనాశనం చేయడం జెంటిల్మెన్ ఆటకు మాయని మచ్చనే మిగులుస్తుంది. ఈ ఆటను అటు అభిమానులు ఇటు క్రీడాకారులు పూర్తిగా ఆస్వాదించలేని స్థితి క్రికెట్ మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా వుంది.