బెజవాడలో టెన్షన్ నెలకొంది. వామపక్ష పార్టీలు, వైసీపీ, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అయితే ఏపీ పోలీసులు దీనికి అనుమతించలేదు. తాము చట్ట ప్రకారమే ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధనసమతి నేతలు శివాజీ, చలసాని శ్రీనివాస్ లను అరెస్ట్ చేసి ఏకంగా హైదరాబాద్ కు తరలించారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ పెరుగుతోంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు పదవులు అనుభవిస్తుండగా, తమను మాత్రం చట్టాలను ఉల్లంఘించామని అరెస్ట్ లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రత్యేకహోదా సాధన సమితి నేతలు.
ఎక్కడికక్కడ అరెస్ట్ లు...
ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాల్సిందిగా గత కొన్నిరోజులుగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్రరంలోని పదమూడు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఏపీలోని పదమూడు జిల్లాల నుంచి నిన్న రాత్రి ఆందోళనకారులు బయలుదేరారు. అయితే వారిని జిల్లా సరిహద్దుల్లోనే అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగతుండగా ఇటువంటి వాటికి అనుమతివ్వబోమని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వామపక్ష, వైసీపీ, ప్రత్యేక హోదాసాధన సమితి నేతలు మాత్రం తాము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెబుతున్నారు. దీంతో బెజవాడలో టెన్షన్ టెన్షన్ గా ఉంది.