బెజవాడ పోలీసులా...? పొలిటికల్ లీడర్లా?

Update: 2018-01-28 09:30 GMT

రాజ‌కీయాల నుంచి నేత‌లు పుడ‌తారు. కానీ, పోలీసుల నుంచి కూడా నేత‌లు పుడ‌తారా? అంటే పుడ‌తారు అని చెప్ప‌క త‌ప్ప‌దు. అది ఆయా పోలీసులు త‌మ వృత్తిని మ‌ధ్య‌లోనే వ‌దులుకునో.. లేదా రిటైర్ అయ్యాకో.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల్లో చ‌క్రం తిప్పుతారు. దీనికి టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్యే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. గ‌తంలో ఈయ‌న విజ‌య‌వాడ‌లో స‌ర్కిల్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా ప‌నిచేసి.. అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఈగైనా వాల‌నివ్వ‌ని నేత‌ల్లో ఒక‌రుగా వ‌ర్ల రామ‌య్య పేరు తెచ్చుకున్నారు. ఈయ‌న ఎస్సీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికావ‌డం రాజ‌కీయాల్లో లాభించింది కూడా. 2009లో తిరుప‌తి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో కృష్ణాజిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌ర్ల ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే, అప్ప‌టి జ‌గ‌న్ హ‌వా నేప‌థ్యంలో ఈయ‌న ఉప్పులేటి క‌ల్ప‌న‌పై ఓడిపోయారు.

డిపార్ట్ మెంట్ లో మంచిపేరు....

ఇక‌, ఇప్పుడు విష‌యంలోకి వెళ్తే.. విజ‌య‌వాడ‌కు పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న గౌతం స‌వాంగ్ పోలీసు అధికారిగా ఉంటూనే రాజ‌కీయాల్లో పండిపోయార‌ని టీడీపీ నేత‌లు గుస‌గుస లాడుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా టీడీపీకి అనుకూలంగా భారీ ఎత్తున చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. పైకి సౌమ్యంగా, స్టిక్ట్‌గా ఉంటున్న అధికారిగా స‌వాంగ్ డిపార్ట్‌మెంట్‌లో ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. అయితే, ఈయ‌న రాజ‌కీయంగా విజ‌య‌వాడ‌లో త‌న దైన శైలిలో టీడీపీకి అండ‌గా నిలుస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇటీవ‌ల రెండు కేసుల విష‌యంలో ఆయ‌న చూపిన వ్య‌వ‌హార శైలి.. దీనికి బ‌లం చేకూరుస్తోంది.

ఎమ్మెల్యే జోక్యంతో....

పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌.. ఓ మ‌హిళ‌ను అక్ర‌మంగా కేసులో ఇరికించార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓ మ్యాట్రిమోనీ వ్య‌వ‌హారంలో రెండు రోజుల ప‌రిచ‌యంలో స‌ద‌రు మ‌హిళ‌.. ప‌ట‌మ‌ట‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి సుమారు రెండు ల‌క్ష‌ల‌ను ఆన్‌లైన్‌లో గుంజింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ప‌ట‌మ‌ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే, ఈ మ‌హిళ‌పై కేసు న‌మోదు చేయ‌డంలో ఎమ్మెల్యే బోడే స్వ‌యంగా ఉన్నార‌ని ఆ మ‌హిళ త‌ల్లి ఆరోపించింది. తీగ లాగితే.. డొంక పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో తేలింద‌ని తెలిసింది. ఎమ్మెల్యే బోడే ఒత్తిడి విష‌యం క‌మిష‌న‌ర్ దాకా కూడా వెళ్లింద‌ని అయితే, దీనిని కొందరు తొక్కిపెట్టార‌ని విప‌క్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.

దేవినేని ఉమపైనకూడా....

అదేవిధంగా మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై కూడా ఓ మ‌హిళ‌.. త‌మ స్థ‌లాన్ని క‌బ్జా చేసేందుకు మంత్రి అనుచ‌రులు, సోద‌రుడు ఒక‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌మిష‌న‌ర్‌కు స్వ‌యంగా ఫిర్యాదు చేశారు. అయితే, దీనిని కూడా క‌మిష‌న‌ర్ తొక్కి పెట్టార‌ని స‌ద‌రు మ‌హిళే ఆరోపించి మీడియాకు ఎక్కే వ‌ర‌కు బ‌య‌ట‌కు పొక్క‌లేదు. ఇక సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ అదే ప‌రిస్థితి ఉందంటున్నారు. ఇక్క‌డ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌రావు చెప్పిన‌ట్టే క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇక ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ర్యాలీలు, ధ‌ర్నాలు చేసేందుకు క‌మిష‌న‌రేట్‌లో అనుమ‌తులు ల‌భించ‌డం లేద‌ని సీపీఐ, సీపీఎం నేత‌లు ఎప్ప‌టి నుంచో ఆరోపిస్తున్నారు. సో.. వీట‌న్నింటినీ గ‌మ‌నిస్తే.. టీడీపీకి బెజవాడ పోలీసులు అండ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు విమ‌ర్శ‌కులు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది కామ‌నే అయినా.. ఇలా కీల‌క కేసుల్లో కూడా ఇలా తొక్కిపెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

Similar News