రాజధాని కావడం అందునా అధికారంలో ఉండటం ప్రతి ఒక్క నేత తమదే పైచేయి కావాలనుకుంటున్నారు. రాజధాని విజయవాడలో తెలుగు తమ్ముళ్ల వ్యవహారం చంద్రబాబును నిద్ర పోనివ్వడం లేదు. రోజూ ఏదో ఒక సమస్య తెచ్చి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్పొరేటర్ల వరకూ ఇదే తంతు. దీంతో చంద్రబాబు ఈ పంచాయతీలు తీర్చడానికే అధిక సమయం వెచ్చించాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కాల్ మనీ, భూదందాలు, అక్రమ ఇసుక వ్యాపారాలు ఇలా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతున్నారు.
మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే.....
తాజాగా విజయవాడ కార్పొరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ల మధ్య వివాదం రచ్చ కెక్కింది. వీరిద్దరి మధ్య గతకొంతకాలంగా అంతర్యుద్ధం నడుస్తూనే ఉంది. గద్దె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మేయర్ కోనేరు శ్రీధర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. దీంతో గద్దె రామ్మోహన్ సీరియస్ అయ్యారు. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న తన అనుచరుడి భవనం అక్రమమని మేయర్ కూల్చి వేయడాన్ని గద్దె తప్పుపడుతున్నారు. దీనిపై మంత్రికి కూడా గద్దె ఫిర్యాదు చేశారు.
మేయర్ ను మార్చాలంటూ....
ఇక కోనేరు శ్రీధర్ నేరుగా లోకేష్ బాబు తో సంబంధాలున్నాయి. విజయవాడలో ఏం జరిగినా శ్రీధర్ లోకేష్ కు చెబుతారని ఒక టాక్ పార్టీలోనూ ఉంది. దీంతో శ్రీధర్ గద్దె అనుచరులను టార్గెట్ చేశారని పార్టీలో చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా 16 మంది టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేశఆరు. మేయర్ ను వెంటనే మార్చాలంటూ 16 మంది కార్పొరేటర్లు టీడీపీ హైకమాండ్ కు లేఖలు రాశారు. వీరి వెనక గద్దె రామ్మోహన్ హస్తం ఉందని మేయర్ అనుమానిస్తున్నారు. 16 మంది కార్పొరేటర్లు విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు కూడా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వద్దనే తేల్చుకుంటామని 16 మంది కార్పొరేటర్లు చెబుతున్నారు. మొత్తం మీద బెజవాడ తెలుగుతమ్ముళ్లు వీధిన పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.