తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కాషాయ పార్టీపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనీ మట్టి కరిపించడమే తన ముందున్న లక్ష్యమంటున్నారు మమత. ఇటీవల త్రిపుర ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తమ ముందున్నది మూడే రాష్ట్రాలని, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిషాలో గెలిస్తే ఇక సంపూర్ణ విజయం సాధించినట్లేనని అమిత్ షా మీడియాతో అన్నారు. దీనిపై మమత బెనర్జీ ఫైరయ్యారు.
చలో ఢిల్లీ అంటున్న మమత.....
‘‘వాళ్ల లక్ష్యం బెంగాల్ అట. అలా అయితే మన లక్ష్యం ఎర్రకోట అనే చెప్పాలి. ఢిల్లీని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిద్దాం. చలో ఢిల్లీ అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదమే మాకు స్ఫూర్తి’’ అంటూ మమత ఆక్రోశం వెళ్లగక్కారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో కమ్యునిస్టు పార్టీకి ధీటుగా కమలం పార్టీ పాతుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం అధికార తృణమూల్ కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇది మమతకు కొంత ఆందోళన కలిగించే అంశమే.
మమతకు చికాకు తెప్పిస్తున్న కమలం.....
బీజేపీ పక్కా వ్యూహం ప్రకారం పోల్ మేనేజ్ మెంట్ చేస్తూ విజయాలకు చేరువవుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు మమతకు కొంత చికాకును కల్గిస్తున్నాయి. అందుకోసమే ఇక కాంగ్రెస్ తో పని లేకుండా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలనూ కలుపుకుని వెళ్లే దిశగా మమత కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ప్రయత్నాలకు వెంటనే స్పందించిన మమత ఆయన ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ తో కంటే అన్ని పార్టీలూ కలసి, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంటు స్థానాలను సాధించుకుంటే కేంద్రాన్ని కట్టడి చేయవచ్చని, రాష్ట్రాల నుంచే కేంద్రాన్ని శాసించవచ్చన్నది మమత ఆలోచన.