రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. మతం, కులం, ప్రాంతం, వర్గం ఇలా ఏ సెక్టార్ ను మిస్ కాకుండా టార్గెట్ చేస్తూ తెలుగుదేశం కు అందరు ఓటేసేలా వ్యూహరచన కార్యక్రమానికి పదును పెట్టారు ఏపీ సీఎం. గత ఎన్నికల్లో టిడిపికి, వైసిపి నడుమ దూరం రాష్ట్రవ్యాప్తంగా ఐదులక్షల ఓట్లే ఉండటంతో ఆ గ్యాప్ మరింత పెంచే స్కెచ్ వేస్తున్నారు చంద్రబాబు. ఏ వర్గాన్ని అలక్ష్యం చేయకూడదని భావిస్తూ ఆయన పూర్తి ఎన్నికల ఆలోచనలతో తిరిగి అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నారు ఆయన. ఇప్పటికే కులానికో కార్పొరేషన్ పెట్టి వాటిద్వారా రుణాలు మంజూరు చేసే కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. అగ్రకులాల్లో కాపులను బీసీలుగా తీర్మానం చేసి ,కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య క్షత్రియ కులాలకు సైతం రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నాలు సైతం చేపట్టారు. కానీ మోడీ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం ఇప్పుడు మరుగున పడేలా చేసినా పూర్తి ఓటు బ్యాంక్ లక్షిత నిర్ణయాలే బాబు అమలు చేస్తున్నారు.
వారిని ఎందుకు వదిలేయాలి ? అని ...
సమాజంలో నిరాదరణకు గురయ్యి పలు సమస్యలు ఎదుర్కొంటున్న హిజ్రాలను మాత్రం ఎందుకు వదిలేయాలి అని భావించారు ఏపీ సీఎం. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసే యోచన చేశారు. అందులో భాగంగా వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి వీలుగా రుణాలు అందజేయడం, సొంత ఇళ్లు కట్టించడం, 1500 రూపాయల పెన్షన్లు అందించాలని నిర్ణయించారు. ఈ అంశం క్యాబినెట్ లో చర్చించి ఆమోదించేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నగరాల్లో వీరిసంఖ్య గణనీయంగానే వుంది. రాబోయే ఎన్నికల్లో వీరు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉందని గుర్తించిన చంద్రబాబు వ్యక్తిగత ఓట్లే లక్ష్యంగా ఎన్నికలకు ముందుగానే సిద్ధం అవుతున్నారు. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.